మిల్లర్ ఓరుగంటి కిరణ్ అరెస్ట్
కేటాయింపు చేసిన ధాన్యాన్ని మాయం చేసిన వ్యాపారి
ప్రభుత్వం నుంచి తీసుకున్న ధాన్యం బహిరంగ మార్కెట్లో విక్రయం
సివిల్ సప్లై విజిలెన్స్ అధికారుల దాడుల్లో స్కాం వెలుగులోకి
22న ‘శ్రీ అరుణాచల శివ రైస్, ఫుడ్ అండ్ ఇండస్ట్రీస్’లో తనిఖీలు
442.720 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం మాయం చేసినట్లుగా నిర్ధారణ
అమ్ముకున్న ధాన్యం విలువ రూ.కోటి 23లక్షలకు పైగా ఉంటుందని అంచనా
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సంచలనం రేపుతున్న ఘటన
కాకతీయ,ఖమ్మం బ్యూరో : కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ధాన్యాన్ని పక్కదారి పట్టించిన కేసులో ప్రధాన నిందితుడైన రైస్ మిల్లర్ ఓరుగంటి కిరణ్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వరంగల్ రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మరియు సివిల్ సప్లై అధికారుల సంయుక్త తనిఖీల్లో వెలుగుచూసిన ఈ భారీ కుంభకోణం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ప్రభుత్వం అందించే ధాన్యాన్ని మిల్లుల్లో భద్రపరచాల్సిన బాధ్యత విస్మరించి, దొడ్డిదారిన మార్కెట్లో విక్రయిస్తూ అందినకాడికి దోచుకుంటున్న మిల్లర్ల బండారం ఆకస్మిక తనిఖీల్లో బట్టబయలైంది.
ఆకస్మిక దాడుల్లో వెలుగుచూసిన అక్రమాలు
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురం గ్రామంలోని ‘శ్రీ అరుణాచల శివ రైస్, ఫుడ్ అండ్ ఇండస్ట్రీస్’ మిల్లుపై వరంగల్ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ మరియు సివిల్ సప్లైస్ అధికారులు ఈ నెల 22వ తేదీన ఆకస్మిక దాడులు నిర్వహించారు. మిల్లులోని స్టాక్‌ను, అధికారిక రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించగా ప్రభుత్వానికి అందజేయాల్సిన సీఎంఆర్ వరి ధాన్యం నిల్వల్లో భారీ వ్యత్యాసం ఉండటాన్ని అధికారులు గుర్తించారు.
కోటి పైచిలుకు గోల్మాల్
అధికారిక రికార్డుల ప్రకారం మిల్లులో ఉండాల్సిన స్టాక్ కంటే ఏకంగా 442.720 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం తక్కువగా ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. లెక్కల్లో చూపకుండా పక్కదారి పట్టిన ఈ ధాన్యం మార్కెట్ విలువ సుమారు రూ. 1,23,96,160/ ఉంటుందని అంచనా వేశారు. ప్రభుత్వ ధాన్యాన్ని అక్రమంగా బయట మార్కెట్లో విక్రయించి భారీ మొత్తంలో అక్రమ సంపాదనకు పాల్పడినట్లు విజిలెన్స్ తనిఖీల్లో స్పష్టమైంది.
క్రిమినల్ కేసులు నమోదు… రిమాండ్‌కు తరలింపు
ప్రభుత్వ ఆస్తులను అక్రమంగా పక్కదారి పట్టించి భారీ మోసానికి పాల్పడినందుకు గాను అరుణాచల శివ రైస్, ఫుడ్ అండ్ ఇండస్ట్రీస్ పై అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ కుంభకోణానికి ప్రధాన బాధ్యుడిగా తేల్చిన రైస్ మిల్లు భాగస్వామి ఓరుగంటి కిరణ్‌ను నేలకొండపల్లి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్‌కు తరలించారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే ఇలాంటి మిల్లర్లపై నిఘా మరింత కఠినతరం చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.

