పాత కక్షలే యువకుడి హత్యకు కారణమా?
ఉర్సుగుట్టలో గొంతు కోసి దారుణ హత్య
మృతుడు కాంగ్రెస్ కార్యకర్తగా గుర్తింపు
నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : పాత కక్షలే యువకుడి హత్యకు కారణమై ఉండొచ్చనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గంలోని మిల్స్ కాలనీ పోలీస్‌స్టేషన్ పరిధి బీఆర్ నగర్‌లో శనివారం సాయంత్రం ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం.. బీఆర్ నగర్‌కు చెందిన మాడ అనిల్ (20) శనివారం సాయంత్రం ఉర్సుగుట్ట సమీపంలోని సీపీఎం కార్యాలయం గల్లీలో గొంతు కోసిన గాయాలతో మృతిచెందినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే మిల్స్ కాలనీ ఎస్‌హెచ్‌ఓ స్వామి పోలీసు సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
అన్ని కోణాల్లో దర్యాప్తు
మృతుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా స్థానికులు పేర్కొంటున్నారు. పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ, అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొనడంతో బందోబస్తు ఏర్పాటు చేశారు. నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని ఎస్‌హెచ్‌ఓ స్వామి వెల్లడించారు.

