పొరండ్లలో విషాదం..
విష జ్వరాలతో ఇద్దరు చిన్నారుల మృతి
కాకతీయ, జగిత్యాల : విష జ్వరాల నివారణకు పారిశుద్ధ్య చర్యలు ముమ్మరం చేయడంతో పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ అదనపు డైరెక్టర్ పద్మజ సూచించారు. జగిత్యాల జిల్లా గ్రామీణ మండలం పొరండ్లలో ఒకే రోజు వ్యవధిలో ఇద్దరు చిన్నారులు జ్వరంతో మృతిచెందిన నేపథ్యంలో ఆమె శనివారం గ్రామంలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. గ్రామానికి చెందిన అరుణ్తేజ (6) గురువారం జ్వరంతో కరీంనగర్లో చికిత్స పొందుతూ మృతిచెందగా, హరిస్మిత (6) అనే చిన్నారి కూడా కరీంనగర్లోని ప్రతిమ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఒకే గ్రామంలో ఇద్దరు చిన్నారులు మృతిచెందడంతో వైద్య ఆరోగ్యశాఖ వెంటనే స్పందించి గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసింది.
డెంగీ కాదని స్పష్టీకరణ
చిన్నారులకు డెంగీ లక్షణాలు లేవని, విష జ్వరాల కారణంగానే మృతిచెందినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు వైద్యాధికారులు తెలిపారు. అదనపు డైరెక్టర్ పద్మజ, జిల్లా వైద్యాధికారిణి సుజాత, డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్ గ్రామంలో పర్యటించి జ్వరబాధితులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం జగిత్యాల మాతాశిశు ఆస్పత్రిని సందర్శించిన అధికారులు జ్వరంతో చికిత్స పొందుతున్న రోగుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. అవసరమైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. గ్రామంలో జ్వరాల నియంత్రణకు అవసరమైన చర్యలను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

