సజీవ దహనం హత్య కేసులో ఏడుగురి అరెస్టు
ప్రధాన నిందితుడితో పాటు మరో ఆరుగురికి జ్యుడీషియల్ రిమాండ్
పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు
ఎన్. శ్వేత, వరంగల్ పోలీస్ కమిషనర్
కాకతీయ, వరంగల్ బ్యూరో: ఎనుమాములలో వ్యక్తిపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేసి హత్య చేసిన సంచలన కేసును వరంగల్ పోలీసులు వేగంగా ఛేదించి ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడితో పాటు మరో ఆరుగురిని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించగా, పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత తెలిపారు. కేసును త్వరితగతిన పూర్తి చేసి నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సీపీ తెలిపిన వివరాల ప్రకారం.. గీసుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎనుమాముల ఎన్‌టీఆర్ నగర్‌కు చెందిన అడుపు మహేష్‌పై ప్రధాన నిందితుడు పట్టి కుమారస్వామి అలియాస్ కుమార్ పాత కక్ష పెంచుకున్నాడు. గతంలో హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవించి బెయిల్‌పై బయటకు వచ్చిన కుమారస్వామి, తనపై తప్పుడు ప్రచారం చేస్తూ స్థానిక ప్రజాప్రతినిధి వద్ద రాజకీయంగా నష్టం కలిగిస్తున్నాడనే అనుమానంతో మహేష్‌ను హత్య చేయాలని కుట్ర పన్నాడు. ఈ కుట్రలో గంధం నరేష్, జన్ను మధు, పిట్ల శ్రీనివాస్ అలియాస్ బండి శ్రీను, సురేష్ (పరారీలో), లాసాని రాంసాయి, టోని సంజయ్య, పోతారం శివకుమార్ పాల్గొన్నారు.
ప్రత్యేక బృందాలతో కేసు ఛేదించిన పోలీసులు
ఈ నెల 18వ తేదీ రాత్రి పరిమళ కాలనీ రోడ్డు నంబర్-2 వద్ద మహేష్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించడంతో తీవ్రంగా గాయపడిన ఆయన చికిత్స పొందుతూ జూలై 19న మృతి చెందాడు. మృతుడి భార్య అడుపు నాగలక్ష్మి ఫిర్యాదు మేరకు గీసుగొండ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 237/2026గా భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు అధికారి విశ్వేశ్వర్ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందాలు సాంకేతిక ఆధారాలు, ఇతర సమాచారంతో ఏడుగురు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోందని సీపీ ఎన్. శ్వేత తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన మామునూరు ఏసీపీ వెంకట్, టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్, దర్యాప్తు అధికారి విశ్వేశ్వర్, టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్లు బాబులాల్, సుబ్బారెడ్డి, దేవేందర్, శ్రీధర్‌తో పాటు గీసుగొండ పోలీస్ స్టేషన్, టాస్క్‌ఫోర్స్ సిబ్బందిని ఆమె అభినందించారు.

