పెద్ది ఆరోగ్యంపై హైటెన్షన్..!
తీవ్ర గుండెపోటుతో అస్వస్తతకు గురైన జననేత
హనుమకొండ రోహిణి ఆస్పత్రిలో అత్యవసర చికిత్స
సీపీఆర్‌తో గుండె స్పందన పునరుద్ధరణ
గ్రీన్ ఛానల్ ద్వారా వెంటిలేటర్‌పై హైదరాబాద్‌కు తరలింపు
కుటుంబ సభ్యులకు కేటీఆర్, హరీశ్‌రావు పరామర్శ
పెద్ది ఆరోగ్యంపై కేసీఆర్ ఎప్పటికప్పుడు ఆరా..!
జనసంద్రంగా మారిన రోహిణి ఆస్పత్రి.. కన్నీరు పెట్టుకున్న అభిమానులు
కాకతీయ, వరంగల్ బ్యూరో : నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదివారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. కార్డియాక్ అరెస్ట్ (తీవ్ర గుండెపోటు) రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన హనుమకొండలోని రోహిణి ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసుకొచ్చే సమయానికి పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో వైద్యులు అత్యవసర చికిత్స ప్రారంభించారు. దాదాపు గంటపాటు పలుమార్లు సీపీఆర్ నిర్వహించి గుండె స్పందనను పునరుద్ధరించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం గ్రీన్ ఛానల్ ద్వారా వెంటిలేటర్ సాయంతో సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి వైద్యుల పర్యవేక్షణలో నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

గంటపాటు వైద్యుల పోరాటం
రోహిణి ఆస్పత్రి కార్డియాలజిస్ట్ డాక్టర్ మమతా రెడ్డి వివరాల ప్రకారం, సుదర్శన్ రెడ్డిని ఆస్పత్రికి తీసుకొచ్చే సమయానికి కార్డియాక్ అరెస్ట్ పరిస్థితి నెలకొంది. వెంటనే వైద్య బృందం అత్యవసర చికిత్స ప్రారంభించి దాదాపు గంటపాటు నిరంతరాయంగా సీపీఆర్ నిర్వహించింది. దీంతో గుండె స్పందనను తిరిగి తీసుకురాగలిగామని ఆమె తెలిపారు. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ప్రధాన రక్తనాళంలో గడ్డకట్టడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని, అవసరమైన అత్యవసర చికిత్స అనంతరం పరిస్థితిని నిలకడలోకి తీసుకొచ్చి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించినట్లు వెల్లడించారు.

ఆస్పత్రికి చేరుకున్న కేటీఆర్, హరీశ్‌రావు
సుదర్శన్ రెడ్డి అస్వస్థత సమాచారం తెలిసిన వెంటనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు హనుమకొండలోని రోహిణి ఆస్పత్రికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం అంబులెన్స్ వెంట హైదరాబాద్‌కు బయలుదేరారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయనకు అత్యుత్తమ వైద్యం అందేలా చూడాలని కేటీఆర్‌కు సూచించినట్లు సమాచారం.


పెద్ది ఆరోగ్యంపై హైటెన్షన్.. జనసంద్రంగా మారిన ఆస్పత్రి
పెద్ది సుదర్శన్ రెడ్డి అస్వస్థత వార్త క్షణాల్లోనే ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వ్యాపించింది. విషయం తెలుసుకున్న వెంటనే నర్సంపేట నియోజకవర్గం నుంచి వందలాది మంది కార్యకర్తలు, అభిమానులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు హనుమకొండలోని రోహిణి ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రి పరిసరాలు ఒక్కసారిగా జనసంద్రంగా మారాయి. ఎవరిని చూసినా పెద్ది ఆరోగ్య పరిస్థితి గురించే చర్చించుకుంటూ కనిపించారు. వైద్యుల నుంచి ప్రతి క్షణం సమాచారం తెలుసుకునేందుకు అభిమానులు ఆత్రుతగా ఎదురుచూశారు.
కన్నీటి పర్యంతమైన అభిమానులు
తీవ్ర అస్వస్థతకు గురయ్యారన్న సమాచారం తెలుసుకున్న పలువురు అభిమానులు భావోద్వేగానికి లోనయ్యారు. కొందరు ఆస్పత్రి ఆవరణలోనే కన్నీటి పర్యంతమవగా, మరికొందరు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సామాజిక మాధ్యమాల్లో ఆయన మరణించినట్లు ప్రచారం జరగడంతో అభిమానుల్లో మరింత ఆందోళన నెలకొంది. అయితే అలాంటి ప్రచారాలను వైద్యులు ఖండిస్తూ, ఆయనకు చికిత్స కొనసాగుతోందని, ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో నిలకడగా ఉందని స్పష్టం చేశారు. దీంతో అభిమానులు, పార్టీ శ్రేణులు ఊపిరిపీల్చుకున్నప్పటికీ, ఆయన పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ యశోద ఆస్పత్రి వద్దకు కూడా భారీ సంఖ్యలో తరలివెళ్తున్నారు.

