- మూడో ప్రమాద హెచ్చరిక జారీ
- లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎస్పీ హెచ్చరిక
కాకతీయ, ఏటూరునాగారం : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గోదావరి నదికి వరద ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం నదిలో నీటిమట్టం మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరిన నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్‌నాథ్ సూచించారు. లోతట్టు ప్రాంతాలు, బ్యాక్‌వాటర్ ప్రభావిత గ్రామాల ప్రజలు పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ పోలీసు, రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖల సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. ఏటూరునాగారం, వాజేడు, మంగపేట, పేరూరు, కన్నాయిగూడెం, వెంకటాపురం మండలాల్లోని గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ పేర్కొన్నారు.
వరద ఉద్ధృతి పెరిగే అవకాశం ఉన్నందున అధికారులు సూచిస్తే ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని, వరద తగ్గే వరకు మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ గోదావరిలో చేపల వేటకు వెళ్లరాదని ఎస్పీ స్పష్టం చేశారు. అలాగే నదిలోకి దిగడం, ఈత కొట్టడం, పడవల ద్వారా ప్రయాణించడం వంటి సాహసాలు ప్రాణాపాయానికి దారితీసే అవకాశం ఉందని హెచ్చరించారు. గోదావరి ఒడ్డున నివసించే కుటుంబాలు చిన్నారులను నది వద్దకు వెళ్లనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వదంతులను నమ్మకుండా అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. జిల్లా పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖలు వరద పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని ఎస్పీ తెలిపారు.

