- ఆగస్టు 24న ఏటూరునాగారంలో తుడుందెబ్బ కార్యాచరణ
- పోడు భూములు, ఏజెన్సీ ఉద్యోగాలు, 1/70 చట్టం అమలు సహా పలు డిమాండ్లు
కాకతీయ, ఏటూరునాగారం : ఆదివాసీల హక్కుల పరిరక్షణ, పోడు భూములకు పట్టాలు, ఏజెన్సీ ఉద్యోగాల్లో స్థానికులకు ప్రాధాన్యం, 1/70 చట్టం అమలు తదితర డిమాండ్ల సాధన కోసం ఆగస్టు 24న ఏటూరునాగారం ఐటిడీఏ కార్యాలయాన్ని ముట్టడించాలని ఆదివాసి హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం ఏటూరునాగారం గిరిజన భవన్‌లో నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా తుడుందెబ్బ సమావేశంలో తీర్మానం చేశారు. సమావేశానికి ఏఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు కొప్పుల రవి అధ్యక్షత వహించగా తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు డా. మైపతి అరుణ్‌కుమార్, జాతీయ ఉపాధ్యక్షుడు పోడెం బాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్నిబిల్లి గణేష్, రాష్ట్ర కార్యదర్శి కుడిమేత సమ్మయ్య, ఆదివాసి మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు వటం సుభద్రతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైపతి అరుణ్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆదివాసీలు విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని ఆరోపించారు.
పోడు భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలని, అటవీశాఖ దాడులను నిలిపివేయాలని, ఏజెన్సీ ప్రాంత ఉద్యోగాలను ఏజెన్సీ సర్టిఫికెట్ ఉన్న స్థానిక ఆదివాసులతోనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఐటిడీఏలో 29 సెక్టార్లను పునరుద్ధరించి ఖాళీగా ఉన్న ఏపీఓ, ఏఓ, ఎస్‌ఓ, ఈఈ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అక్రమ వడ్డీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు 1/70 చట్టాన్ని బలహీనపరిచే ప్రయత్నాలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఆదివాసీల సమస్యలు పరిష్కారం కాకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూ ఆగస్టు 24న ఏటూరునాగారం ఐటిడీఏ కార్యాలయం ఎదుట ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సమావేశంలో పిలుపునిచ్చారు.

