16న ములుగుకు సీఎం రేవంత్ రెడ్డి
మేడారం అభివృద్ధి పనుల పరిశీలన
సమీకృత కలెక్టరేట్ ప్రారంభోత్సవం
కాకతీయ, ములుగు ప్రతినిధి: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఈ నెల 16న ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో మేడారం సమ్మక్క–సారలమ్మ దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించడంతో పాటు, ములుగు పట్టణంలో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించనున్నారు. అధికారిక షెడ్యూల్ ప్రకారం ముందుగా మేడారం చేరుకుని సమ్మక్క–సారలమ్మ అమ్మవార్లను దర్శించుకునే అవకాశం ఉంది. అనంతరం మేడారం మాస్టర్‌ప్లాన్ కింద చేపడుతున్న పనులను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. జాతరకు శాశ్వత మౌలిక సదుపాయాల కల్పన, భక్తులకు మెరుగైన సౌకర్యాలపై దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. తర్వాత ములుగు పట్టణంలోని గట్టమ్మ దేవాలయం సమీపంలో నిర్మించిన సమీకృత జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం హెలిప్యాడ్, భద్రత, ట్రాఫిక్, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ తదితర ఏర్పాట్లను వేగవంతం చేసింది.

