కేసీఆర్ పర్యటనలో భద్రతా వైఫల్యమా?
మల్లంపల్లి క్రాస్ వద్ద వాహనాన్ని చుట్టుముట్టిన కార్యకర్తలు
భద్రతా ఏర్పాట్లపై బీఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహం
కాకతీయ,ములుగు ప్రతినిధి: వరంగల్ జిల్లా నల్లబెల్లిలో దివంగత నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనలో ములుగు జిల్లా మల్లంపల్లి వద్ద భద్రతా లోపం కనిపించిందని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. మల్లంపల్లి–నర్సంపేట క్రాస్ వద్ద కేసీఆర్ వాహనం చేరుకోగానే పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు వాహనం చుట్టూ గుమిగూడారు. కొందరు వాహనం ముందుభాగానికి చేరుకుని చేతులతో కొడుతూ నినాదాలు చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కేసీఆర్ వాహనం క్రాస్ వద్దకు చేరుకున్న సమయంలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రోడ్డుపైకి వచ్చి స్వాగతం పలికేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కొందరు వాహనం ముందుభాగానికి చేరుకోవడంతో వాహనం ముందుకు వెళ్లేందుకు ఇబ్బందులు ఏర్పడ్డాయని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కార్యకర్తలను నియంత్రించేందుకు అక్కడ తగినంత పోలీసు బందోబస్తు కనిపించలేదని ఆరోపిస్తున్నాయి.
ఇద్దరు కానిస్టేబుళ్లతోనే భద్రతా ఏర్పాట్లు?
మాజీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి జిల్లాలో పర్యటిస్తున్న సమయంలో భద్రతా ఏర్పాట్లపై బీఆర్ఎస్ శ్రేణులు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. కేసీఆర్ పర్యటన సందర్భంగా మల్లంపల్లి ప్రాంతంలో కేవలం ఇద్దరు కానిస్టేబుళ్లను మాత్రమే భద్రత కోసం నియమించారని పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. దీంతో అభిమానులు, కార్యకర్తలు ఒక్కసారిగా వాహనం వద్దకు చేరుకోవడంతో పరిస్థితి అదుపు తప్పినట్లు పేర్కొంటున్నాయి. ఘటనపై పోలీసు యంత్రాంగం స్పందించాల్సి ఉంది.

