న్యాయస్థానాలపై నమ్మకంతో పోరాటం
అజంజాహి మిల్స్ మాజీ ఉద్యోగులకు 200 గజాల స్థలాలు ఇవ్వాలి
318 మంది కార్మికులకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఆదేశాలు
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : న్యాయవ్యవస్థపై తమకు అపారమైన విశ్వాసం ఉందని, ఆ నమ్మకంతోనే కార్మికుల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తున్నామని అజంజాహి మిల్స్ వీఆర్ఎస్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కుడికాల కుమారస్వామి, జన్ను రమేష్ అన్నారు. మిల్లు మూసివేత సమయంలో వీఆర్ఎస్ తీసుకున్న ఉద్యోగులందరికీ 200 గజాల చొప్పున ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆదివారం నగరంలోని చింతల్ బ్రిడ్జి వద్ద వీఆర్ఎస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మృతి చెందిన తోటి కార్మికులకు రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం కుడికాల కుమారస్వామి, జన్ను రమేష్ మాట్లాడుతూ అజంజాహి మిల్లు 2002లో మూతపడిన సమయంలో యాజమాన్యం వాలంటరీ రిటైర్మెంట్ స్కీం ప్రకటించడంతో 452 మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారని తెలిపారు. వారిలో 134 మందికి ఒక్కొక్కరికి 200 గజాల చొప్పున ఇళ్ల స్థలాలు ఇచ్చారని, మిగిలిన 318 మందికి కూడా అదే విధంగా స్థలాలు ఇవ్వాలని కోరినా నేషనల్ టెక్స్టైల్ కార్పొరేషన్ తిరస్కరించిందన్నారు.
హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు
దీంతో కార్మికులు హైకోర్టును ఆశ్రయించగా, 2016 మార్చి 18న వారికి అనుకూలంగా తీర్పు వచ్చిందని తెలిపారు. దీనిపై ఎన్‌టీసీ అప్పీల్‌కు వెళ్లడంతో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశామని, వాదనలు విన్న న్యాయస్థానం 318 మంది రిటైర్డ్ ఉద్యోగులకు కూడా 200 గజాల స్థలాలు ఇవ్వాలని 2021 అక్టోబర్ 26న ఆదేశాలు జారీ చేసిందని పేర్కొన్నారు. 2002లో మిల్లు మూసివేయకముందే పదవీ విరమణ పొందిన వీఆర్ఎస్ కార్మికులకు కూడా 200 గజాల ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసి న్యాయపోరాటం చేస్తున్నట్లు తెలిపారు. 1992 నుంచి 2002 వరకు పీఆర్‌ఎస్ తీసుకున్న కార్మికులకు మిల్లు యాజమాన్యం తీసుకున్న నిర్ణయాల వల్ల అన్యాయం జరిగిందన్నారు. న్యాయమైన డిమాండ్లకు అనుకూలంగా తీర్పు వస్తుందన్న నమ్మకం ఉందని తెలిపారు. ప్రస్తుతం సుమారు 150 మంది కార్మికులు దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్నారని, తీవ్ర మనోవేదనతో కొందరు మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కోశాధికారి పాండవుల సమ్మయ్య, ఈసీ సభ్యులు తౌటం రమేష్, సంజీవ్, సుమారు 50 మంది కార్మికులు పాల్గొన్నారు.

