చదువుతో ఎదగాలి.. ఐక్యతతో బలపడాలి
విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో బైండ్ల సమాజం ముందుకు సాగాలి
పిల్లల చదువును మధ్యలో ఆపొద్దు.. ఉన్నత విద్యతో భవిష్యత్‌ను తీర్చిదిద్దాలి
బైండ్ల భవన్‌కు రూ.2 కోట్ల నిధులు ఇవ్వాలని సీఎంను కోరాం
‘పే బ్యాక్ టు సొసైటీ’ స్ఫూర్తితో సేవ చేయాలి
బీఈఏటీని బలోపేతం చేసి రాష్ట్రవ్యాప్తంగా సమాజాన్ని ఏకతాటిపైకి తేవాలి
వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య
కాకతీయ, హైదరాబాద్ : బైండ్ల సమాజం విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మరింత ముందుకు సాగాలని వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య పిలుపునిచ్చారు. సమాజంలో ఐక్యతను పెంపొందించడంతో పాటు యువత విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన తెలంగాణ బైండ్ల ఉద్యోగుల సంఘం విజన్ మీట్–2026 కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె ఈ మేరకు మాట్లాడారు. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన తాను పార్లమెంట్ వరకు చేరడానికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అందించిన రాజ్యాంగ హక్కులే కారణమని డా. కడియం కావ్య తెలిపారు. కులవృత్తి ద్వారా ఆదాయం వస్తోందనే కారణంతో పిల్లల చదువును మధ్యలోనే నిలిపివేయవద్దని, ఉన్నత విద్య, వృత్తి విద్యను అభ్యసించేలా ప్రోత్సహించాలని కోరారు. ఆడపిల్లల చదువుకు తల్లిదండ్రులు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పిల్లలను ఉన్నతంగా చదివించి జీవితంలో స్థిరపడేలా సహకరించాలన్నారు.
బైండ్ల భవన్‌కు రూ.2 కోట్ల నిధులు
బైండ్ల భవన్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని తాను, ఎమ్మెల్యే కడియం శ్రీహరి కలిసి కోరినట్లు ఎంపీ తెలిపారు. తొలి విడతగా సుమారు రూ.2 కోట్ల నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశామని, త్వరలోనే దీనిపై ప్రభుత్వం నుంచి జీవో వచ్చే అవకాశం ఉందని చెప్పారు. బీఈఏటీని మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బైండ్ల ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, యువతను సంఘంలో భాగస్వాములను చేయాలని డా. కడియం కావ్య కోరారు. గ్రూపులు, విభేదాలకు తావులేకుండా అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని సూచించారు. సోషల్ మీడియా ద్వారా సంఘం కార్యకలాపాలను విస్తృతంగా ప్రచారం చేసి సభ్యత్వాన్ని పెంచుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ‘పే బ్యాక్ టు సొసైటీ’ స్ఫూర్తిని అలవర్చుకుని సమాజానికి తిరిగి సేవ చేయాలని అన్నారు. నిజాయితీ, తెలివితేటలు, ప్రజాబలమే తమ పెట్టుబడులని ఎంపీ పేర్కొన్నారు. రాజకీయ హోదాలు ఉన్నా లేకపోయినా సమాజానికి తన సహకారం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని నిర్వహిస్తూ సమాజంలో పరస్పర అనుబంధాలను పెంచుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బీఈఏటీ అధ్యక్షుడు చినపాక స్వామి, కోశాధికారి డా. జీలకర్ర స్వామి, ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ, సంయుక్త కార్యదర్శి జీలకర్ర రామ్‌మూర్తి, ముఖ్య సలహాదారు కడెం ధనుంజయ, సలహాదారులు డా. జీలకర్ర సోమశేఖర్, చినపాక శ్రీనివాస ప్రసాద్, ఏ. ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

