పరకాల కాంగ్రెస్‌లో సవ్యంగానే ఉందా..?
కీలక క్యాడర్ ఎందుకు సైలెంట్ మరి ?
నియోజకవర్గ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలపై చర్చ
క్యాడర్‌ను ఏకతాటిపైకి తేవడంలో ఎమ్మెల్యేకు సవాల్
సీఎం సభ కోసం సమన్వయ కమిటీతో ప్రత్యేక సమావేశం
బూత్ స్థాయి నుంచి సైనికుల్లా పనిచేయాలని పిలుపు
కాకతీయ, పరకాల : పరకాల కాంగ్రెస్‌లో అంతా సవ్యంగానే ఉందా..? నేతలంతా ఒక్కతాటిపై ఉన్నారా..? క్యాడర్‌ను ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి సమన్వయం చేసుకుంటున్నారా..? అంటే పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయన్న చర్చ పార్టీ వర్గాల్లో సాగుతోంది. ఈ నెల 16న పరకాలలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొనే బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ఎమ్మెల్యే స్వయంగా పార్టీ శ్రేణులతో సమీక్ష నిర్వహించాల్సిన పరిస్థితి రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బూత్ స్థాయి నుంచి ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని, కమిట్‌మెంట్‌తో కూడిన ఆర్గనైజేషన్‌తో సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునివ్వడం వెనుక పార్టీ అంతర్గత సమన్వయ లోపాలే కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు నాయకులు, క్యాడర్‌ను కలుపుకుని వెళ్లడంలో ఎమ్మెల్యే విఫలమవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

సీఎం సభ వేళ.. సమన్వయంపై దృష్టి
ముఖ్యమంత్రి సభకు భారీగా జనసమీకరణ చేయాల్సిన నేపథ్యంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఆత్మకూరు మండల కేంద్రంలోని జీఎస్‌ఆర్ గార్డెన్స్‌లో మండల కాంగ్రెస్ సమన్వయ కమిటీ సభ్యులు, క్లస్టర్ ఇన్‌చార్జిలు, బీఎల్‌ఏలు, సర్పంచులు, గ్రామ పార్టీ కొత్త, పాత అధ్యక్షులు, కాంటెస్టెంట్ సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ పీఏసీఎస్ చైర్మన్లు, సీనియర్ నాయకులతో సమీక్ష జరిపారు. సభ ఏర్పాట్లు, ప్రజల తరలింపు, ప్రచారం, బాధ్యతల కేటాయింపుపై దిశానిర్దేశం చేశారు. అయితే ఇంత విస్తృత స్థాయిలో నాయకులను ఒకచోట చేర్చి ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించాల్సి రావడం పార్టీ కేడర్‌లో సమన్వయం ఏ స్థాయిలో ఉందన్న ప్రశ్నలకు తావిస్తోంది.
కలుపుకొని వెళ్లడంలో లోపమేనా?
ఎన్నికల సమయంలో ఒక్కటిగా పనిచేసిన పార్టీ శ్రేణుల్లో ప్రస్తుతం విభేదాలు పెరుగుతున్నాయన్న చర్చ ఉంది. గ్రామస్థాయి నాయకులు, సీనియర్ నేతలు, కొత్తగా బాధ్యతలు చేపట్టినవారి మధ్య సమన్వయం కొరవడిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాల్సిన సమయంలో నేతల మధ్య దూరం పెరగడం క్యాడర్‌పై ప్రభావం చూపుతోందన్న విమర్శలు ఉన్నాయి. ఎమ్మెల్యే అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నప్పటికీ.. కొంతమంది నాయకులు, కార్యకర్తలకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదన్న అసంతృప్తి ఉందని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. దీంతో నాయకత్వంపై క్యాడర్‌లో అసంతృప్తి పెరుగుతోందన్న వాదన వినిపిస్తోంది.
‘సైనికుల్లా పనిచేయాలి’.. ఎందుకీ పిలుపు?
సీఎం సభను విజయవంతం చేయడం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బాధ్యత అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. బూత్ స్థాయి నుంచి ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి ప్రజలను పెద్దఎత్తున సభకు తరలించేలా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. కమిట్‌మెంట్‌తో కూడిన బలమైన ఆర్గనైజేషన్‌తో ప్రతి గ్రామం, ప్రతి బూత్‌లో సమన్వయంతో పనిచేస్తే సభ చారిత్రాత్మక విజయాన్ని సాధిస్తుందని పేర్కొన్నారు. అయితే క్యాడర్ సహజంగానే సమన్వయంతో పనిచేసే పరిస్థితి ఉంటే ఇలాంటి ప్రత్యేక పిలుపు అవసరం ఉండేదా అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. సభ ఒక్కరోజు కార్యక్రమం కాదని.. నియోజకవర్గంలో పార్టీ బలం, నాయకత్వ సమన్వయానికి కూడా ఇది పరీక్షగా మారిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పరకాల పట్టణంలో జరగనున్న సీఎం సభను పార్టీ నాయకత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. గ్రామాల నుంచి జనసమీకరణ, రవాణా, ప్రచారం తదితర బాధ్యతలను నాయకులకు అప్పగించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కూడా ఎమ్మెల్యే సూచించారు. అయితే సభకు ఎంతమంది జనాన్ని తరలించారన్నదానికంటే.. ఎంతమంది నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేశారు? అన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. పార్టీ అంతర్గత విభేదాలను చక్కదిద్ది క్యాడర్‌ను ఏకతాటిపైకి తీసుకురావడంలో ఎమ్మెల్యే ఎంతవరకు సఫలమవుతారన్నది సభ ఏర్పాట్లతో పాటు భవిష్యత్ రాజకీయాల్లోనూ ప్రభావం చూపనుంది. సీఎం సభను సక్సెస్ చేయడం ఒక ఎత్తయితే.. ఆ పేరుతో బయటపడుతున్న అంతర్గత అసంతృప్తిని చక్కదిద్దడం ఎమ్మెల్యేకు అసలు సవాల్‌గా మారిందన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో సాగుతోంది.

