పెద్ది కుటుంబానికి కేసీఆర్ భరోసా
కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని హామీ
పిల్లలకు చెరో రూ.కోటి.. అమృతమ్మకు రూ.25 లక్షల సాయం
కేసీఆర్ రాకతో భారీగా తరలివచ్చిన బీఆర్‌ఎస్ శ్రేణులు
11 ఏళ్ల తర్వాత నల్లబెల్లికి మాజీ సీఎం
బందోబస్తు వైఫల్యం.. 30 నిమిషాల పాటు కాన్వాయ్‌లోనే కేసీఆర్
కాకతీయ, నల్లబెల్లి : దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబ సభ్యులను బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి అండగా ఉంటానని భరోసా కల్పించారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి ఇద్దరు పిల్లలకు పార్టీ తరఫున చెరో రూ.కోటి చొప్పున, వారి తల్లి అమృతమ్మ బాగోగుల కోసం రూ.25 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించారు. సుమారు 11 ఏళ్ల తర్వాత కేసీఆర్ నల్లబెల్లి గడ్డపైకి రావడంతో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రహదారుల వెంట భారీగా జనం నిలవడంతో నల్లబెల్లిలో సందడి నెలకొంది. అయితే కేసీఆర్ కాన్వాయ్ వద్దకు ఒక్కసారిగా కార్యకర్తలు, అభిమానులు భారీగా చేరుకోవడంతో కొంతసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దీంతో సుమారు 30 నిమిషాలపాటు కేసీఆర్ కాన్వాయ్‌లోనే ఉండాల్సి వచ్చింది. నల్లబెల్లికి చేరుకున్న కేసీఆర్ ముందుగా పెద్ది సుదర్శన్‌రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న కేసీఆర్ వారికి ధైర్యం చెప్పారు. కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. పెద్ది కుటుంబ సభ్యులకు ఆర్థికంగా అండగా నిలిచే చర్యల్లో భాగంగా ఇద్దరు పిల్లలకు చెరో రూ.కోటి చొప్పున చెక్కులను అందించారు. అమృతమ్మ బాగోగుల కోసం రూ.25 లక్షల చెక్కును అందజేశారు. కుటుంబ సభ్యులతో మాట్లాడిన సమయంలో వారి భవిష్యత్ గురించి కూడా భరోసా కల్పించారు.



11 ఏళ్ల తర్వాత నల్లబెల్లికి
పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు కేసీఆర్ సుమారు 11 ఏళ్ల తర్వాత నల్లబెల్లికి రావడం బీఆర్‌ఎస్ శ్రేణుల్లో ప్రత్యేక ఆసక్తి కలిగించింది. ఆయన పర్యటనకు ముందుగానే నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. రహదారుల వెంట కేసీఆర్ రాక కోసం ఎదురుచూశారు. కేసీఆర్ కాన్వాయ్ నల్లబెల్లికి చేరుకోగానే కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో స్వాగతం పలికేందుకు ముందుకొచ్చారు. సాయంత్రం సుమారు 3.30 గంటల సమయంలో కేసీఆర్ కాన్వాయ్ నల్లబెల్లికి చేరుకుంది. అప్పటికే పెద్ద సంఖ్యలో వేచి ఉన్న కార్యకర్తలు ఒక్కసారిగా కాన్వాయ్ వైపు కదిలారు. దీంతో కేసీఆర్ వాహనం చుట్టూ జనం గుమిగూడారు. వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడింది. కార్యకర్తలను నియంత్రించేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ పరిస్థితి కొంతసేపు అదుపులోకి రాలేదు. ఫలితంగా కేసీఆర్ సుమారు 30 నిమిషాల పాటు కాన్వాయ్‌లోనే వేచి ఉండాల్సి వచ్చింది. బీఆర్‌ఎస్ అధినేతను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు రావచ్చని ముందుగానే అంచనా ఉన్నప్పటికీ.. అందుకు అనుగుణంగా బందోబస్తు ఏర్పాట్లు లేకపోవడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి.
కేసీఆర్‌ను చూసేందుకు వచ్చి..
ఉదయం నుంచే కేసీఆర్ కోసం వేచి ఉన్న కార్యకర్తలు, అభిమానులు ఆయనను దగ్గరగా చూసేందుకు ప్రయత్నించారు. అయితే కాన్వాయ్ చుట్టూ భారీగా జనం చేరడంతో పలువురికి ఆ అవకాశం లేకుండా పోయింది. కొందరు వినతిపత్రాలు అందించేందుకు ప్రయత్నించగా.. మరికొందరు కాన్వాయ్‌పై గులాబీ కండువాలు వేసేందుకు ప్రయత్నించారు. కాన్వాయ్ వద్దకు ఓ వాహనం అడ్డంగా రావడంతో పరిస్థితి మరింత గందరగోళంగా మారింది. తోపులాటల మధ్య పోలీసులు కార్యకర్తలను వెనక్కి పంపేందుకు ప్రయత్నించారు. దీంతో కేసీఆర్‌ను చూసేందుకు వచ్చిన కొంతమంది ప్రజలు నిరాశతో వెనుదిరిగారు.
పెద్ది కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం కేసీఆర్ తిరుగు ప్రయాణంలోనూ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో కాన్వాయ్ వెంట కదిలారు. ఈ సమయంలో కౌశిక్‌రెడ్డి మాజీ సీఎం కాన్వాయ్ ముందు నడుస్తూ ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ప్రయత్నించారు. కార్యక్రమంలో ఎర్రబెల్లి దయాకర్‌రావు, వినయ్ భాస్కర్, ఆరూరి రమేష్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాలోత్ కవిత, సత్యవతి రాథోడ్, సంతోష్‌రావు, జీవన్‌రెడ్డి, శంకర్‌నాయక్, నాగూర్ల వెంకటేశ్వర్లు తదితర నాయకులు పాల్గొన్నారు.

