కాంగ్రెస్‌కు ఎర్రబెల్లి వార్నింగ్!
పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహ గద్దె కూల్చివేతపై ఫైర్
కాంగ్రెస్ నేతలు కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి
పద్ధతి మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు: ఎర్రబెల్లి దయాకర్‌రావు
నర్సంపేటలో బీఆర్ఎస్ రాస్తారోకో.. పోలీసులతో నేతల తోపులాట
కాకతీయ, నర్సంపేట: దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహ ఏర్పాటుకు నిర్మించిన గద్దెను కూల్చివేయడంపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం మానుకోవాలని, పద్ధతి మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించినట్లు సమాచారం. ప్రజల మనోభావాలను గౌరవించాలని స్పష్టం చేశారు. గద్దె కూల్చివేతను నిరసిస్తూ సోమవారం నర్సంపేట అంబేద్కర్ సెంటర్లో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు.ఈసందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రజలకు అందించిన సేవలకు గుర్తుగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని భావించగా, అందుకోసం నిర్మించిన గద్దెను కూల్చివేయడం సరికాదని అన్నారు. ప్రజల మనోభావాలను గౌరవించి గద్దెను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.

పోలీసులతో నేతల తోపులాట
రాస్తారోకో సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, పోలీసుల మధ్య తోపులాట జరగడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు పరిస్థితిని శాంతింపజేయడంతో బీఆర్ఎస్ నాయకులు నల్లబెల్లి కార్యక్రమానికి బయలుదేరారు. రాస్తారోకో కారణంగా అంబేద్కర్ సెంటర్ పరిసరాల్లో కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కార్యక్రమంలో బీఆర్ఎస్ నియోజకవర్గ కన్వీనర్ తక్కళ్లపల్లి రవీందర్రావు, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, నాయకులు రాయిడి రవీందర్‌రెడ్డి, వంగేటి అశోక్‌కుమార్, శెంకేశి కమలాకర్, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, మాజీ, ప్రస్తుత కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

