కోరేకల్ ఇసుకలో అదనపు దందా!
రసీదులో ఉన్నదానికంటే రూ.3,500 వరకు అదనం?
చార్జీలన్నీ అధికారికంగానే.. మరి ఈ వసూళ్లెందుకు?
35 టన్నులకు రూ.13,783 చెల్లించిన లారీ ఓనరు
రసీదు బయట వసూళ్లపై కాకతీయ చేతికి చిక్కిన వీడియోలు
విచారిస్తున్నామని కాకతీయకు పీవో వివరణ
కాకతీయ, తెలంగాణ బ్యూరో : ఇసుక కొనుగోలు చేసే ప్రతి వినియోగదారుడి నుంచి ప్రభుత్వం నిర్ణయించిన రుసుములన్నీ పక్కాగా వసూలు చేస్తోంది. ఇసుక ధరతోపాటు సేవా రుసుము, రోడ్డు డ్యామేజ్ చార్జీ, వెయిమెంట్ ఫీజు, జీఎస్టీ.. ఇలా ఒక్కో అంశానికి ప్రత్యేకంగా లెక్క కట్టి అధికారిక రసీదు జారీ చేస్తోంది. అయినా.. రసీదులో పేర్కొన్న మొత్తానికి అదనంగా ఒక్కో లారీకి రూ.3,500 వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు రావడం విస్మయానికి గురిచేస్తోంది. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కోరేకల్ ఇసుక స్టాక్‌యార్డులో ఈ అదనపు వసూళ్లకు సంబంధించిన వీడియోలు వెలుగులోకి రావడంతో వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వమే ప్రతి రుసుముకూ లెక్క చెబుతున్నప్పుడు.. రసీదు బయట వసూలవుతున్న అదనపు మొత్తం ఎవరి లెక్క? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కోరేకల్ స్టాక్‌యార్డు నుంచి 35 మెట్రిక్ టన్నుల ఇసుకకు జారీ చేసిన అధికారిక రసీదు ఈ వ్యవహారంలో కీలకంగా మారింది. సాండ్ సేల్స్ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా జారీ చేసిన ఈ రసీదులో ఇసుక ధర రూ.13,125గా ఉంది. టీజీఎండీసీ సేవా రుసుము కింద రూ.1,225, రోడ్డు డ్యామేజ్ చార్జీ రూ.250, వెయిమెంట్ ఫీజు రూ.100గా పేర్కొన్నారు. వీటికి వర్తించే జీఎస్టీని కలిపి మొత్తం రూ.13,783 చెల్లించినట్లు రసీదులో స్పష్టంగా నమోదైంది.
ప్రతి రుసుముకూ ప్రత్యేక లెక్క
35 మెట్రిక్ టన్నుల ఇసుకకు టన్నుకు రూ.375 చొప్పున రూ.13,125 ధర నిర్ణయించారు. దీనిపై సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ వసూలు చేశారు. ఇసుక ధరతోపాటు టీజీఎండీసీ సేవా రుసుముగా టన్నుకు రూ.35 చొప్పున రూ.1,225 తీసుకున్నారు. రోడ్డు డ్యామేజ్ చార్జీగా రూ.250, వెయిమెంట్ ఫీజుగా రూ.100ను కూడా రసీదులో నమోదు చేశారు. అంటే.. ప్రభుత్వం నిర్ణయించిన చార్జీలన్నింటినీ కలిపితే వినియోగదారుడు చెల్లించాల్సిన మొత్తం ఎంత అన్నది రసీదులోనే స్పష్టంగా ఉంది. ఇంత పక్కాగా లెక్కలు ఉన్నప్పుడు.. రసీదు బయట మరో మొత్తాన్ని ఎందుకు చెల్లించాల్సి వస్తోందన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.
రసీదులో ఒక లెక్క.. బయట మరో లెక్క?
కోరేకల్ స్టాక్‌యార్డులో లారీకి ఇసుక లోడ్ చేసిన తర్వాత అదనంగా రూ.3,500 వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో ఆరోపణలకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. అదనపు వసూళ్ల ఆరోపణల్లో వాస్తవమెంతో తేల్చడం అధికారులకు పెద్ద కష్టమేమీ కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్టాక్‌యార్డులోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించడంతోపాటు లారీ ఎంట్రీ రిజిస్టర్, వెయిమెంట్ వివరాలు, రోజువారీగా జారీ చేసిన రసీదులు, ఇసుక విక్రయాల లెక్కలను సరిపోలిస్తే వాస్తవం బయటపడే అవకాశం ఉంది. ఒక లారీకి రసీదులో ఎంత చూపించారు? వాస్తవంగా ఎంత డబ్బు చెల్లించారు? అదనపు మొత్తం ఎవరికి ఇచ్చారు? నగదుగా ఇచ్చారా? డిజిటల్ చెల్లింపులు జరిగాయా? అన్న వివరాలను పరిశీలిస్తే వ్యవహారం తేలిపోతుంది. ముఖ్యంగా వీడియోల్లో కనిపిస్తున్న దృశ్యాలపై అధికారులు విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది.

