ఇనుగుర్తి మండల కాంగ్రెస్‌లో అసంతృప్తి
మండల అధ్యక్ష పదవిపై గాంధీభవన్‌లో వినతి
స్థానిక నాయకుడికే అవకాశం ఇవ్వాలని డిమాండ్
ఎమ్మెల్యే తీరుపై అధిష్ఠానానికి ఫిర్యాదు
పార్టీ కోసం పనిచేసిన వారికి అన్యాయం చేయొద్దని విజ్ఞప్తి
సామాజిక సమతుల్యత పాటించాలని కోరిన నాయకులు
కాకతీయ, ఇనుగుర్తి : ఇనుగుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎంపిక విషయంలో స్థానిక నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదని కాంగ్రెస్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. మండల పార్టీ అధ్యక్ష పదవిని ఇనుగుర్తి టౌన్‌కు చెందిన నాయకుడికి కేటాయించాలని కోరుతూ మంగళవారం గాంధీభవన్‌లో పీసీసీ ఉపాధ్యక్షుడు, గాంధీభవన్ ఇన్చార్జి కుమార్‌రావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ తమ్మడపల్లి కుమార్, దిశ కమిటీ సభ్యుడు గుజ్జునూరి బాబురావు మాట్లాడుతూ, ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీనాయక్ ఇనుగుర్తి మండలంపై చూపిస్తున్న వివక్షతను పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. గత సార్వత్రిక ఎన్నికల్లో మహబూబాబాద్ ఎమ్మెల్యేను, పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించేందుకు ఇనుగుర్తి టౌన్ నాయకులు, కార్యకర్తలు కష్టపడ్డారని పేర్కొన్నారు. గతంలో మండల పార్టీ అధ్యక్ష పదవిని విలీన గ్రామానికి చెందిన నాయకుడికి ఇచ్చారని, ఈసారి ఇనుగుర్తి టౌన్‌కు అవకాశం కల్పించాలని కోరినా తమ అభ్యర్థనను పట్టించుకోకుండా ఇతర గ్రామానికి చెందిన వ్యక్తికి అవకాశం కల్పించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. టౌన్ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకపోవడంతో పార్టీ శ్రేణుల్లో అసహనం పెరుగుతోందన్నారు.
సామాజిక సమతుల్యత పాటించాలి
నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో మూడు మండలాల పార్టీ అధ్యక్ష పదవులను ఒకే సామాజిక వర్గానికి కేటాయించడం పట్ల ఇతర సామాజిక వర్గాలు, దళిత వర్గాల్లో ఆవేదన వ్యక్తమవుతోందన్నారు. పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్న కార్యకర్తల మనోభావాలను గౌరవించి ఇనుగుర్తి మండల కాంగ్రెస్ విషయంలో సముచిత నిర్ణయం తీసుకోవాలని పీసీసీ అధ్యక్షుడిని కోరినట్లు తెలిపారు. ఇనుగుర్తి టౌన్ నాయకులు, కార్యకర్తలకు న్యాయం జరిగేలా మండల అధ్యక్ష పదవి విషయంలో నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరారు. కార్యక్రమంలో చిన్నల కట్టయ్య, మార్కెట్ డైరెక్టర్ కొట్టం రాము, దేవులపల్లి వెంకన్న, వొల్లంల మురళి, పరుపాటి రవీందర్‌రెడ్డి, కొలిపాక నారాయణ, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మహంకాళి సలీం, టౌన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్, బూర ఇస్తారి, గుజనూరి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

