పీహెచ్‌సీల్లో వైద్య సేవలు మెరుగుపరచాలి
సీజనల్ వ్యాధులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
డ్రై డే యాక్టివిటీలు క్రమం తప్పకుండా నిర్వహించాలి
అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలి
వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. బి. రాజారెడ్డి
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : జిల్లాలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరును మరింత మెరుగుపరచాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. బి. రాజారెడ్డి సూచించారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలని, పీహెచ్‌సీల పరిధిలో డ్రై డే కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహించాలని ఆదేశించారు. మంగళవారం దుగ్గొండి, నల్లబెల్లి, బానోజిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను డీఎంహెచ్‌వో ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్‌సీల్లో వైద్య, ఫార్మసీ సేవలతో పాటు జాతీయ ఆరోగ్య కార్యక్రమాల రికార్డులు, రిజిస్టర్ల నిర్వహణ, పురోగతిని క్షుణ్ణంగా పరిశీలించారు. సిబ్బంది హాజరు, ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై సమీక్ష నిర్వహించారు.
జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష
ఈ సందర్భంగా డా. రాజారెడ్డి మాట్లాడుతూ అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాల్లో మెరుగైన పనితీరు కనబరచాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని తెలిపారు. రికార్డులను ఎప్పటికప్పుడు సక్రమంగా నిర్వహించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులు, సిబ్బందికి సూచించారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలు చేపట్టాలని డీఎంహెచ్‌వో ఆదేశించారు. ప్రతి పీహెచ్‌సీ పరిధిలో డ్రై డే కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహించాలని, దోమల వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర మందులను అన్ని ఆరోగ్య కేంద్రాల్లో తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఆసుపత్రి పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని స్పష్టం చేశారు. అందుబాటులో ఉన్న మానవ వనరులు, మౌలిక సదుపాయాలను సమర్థవంతంగా వినియోగించుకుని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలులో ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా సమన్వయంతో, సమయపాలనతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు.

