ప్రభుత్వ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
కాకతీయ, ములుగు ప్రతినిధి: ప్రభుత్వ విద్యారంగ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. రజనీకాంత్ డిమాండ్ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ ములుగు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నూగూరు వెంకటాపురం నుంచి ములుగు కలెక్టరేట్ వరకు పాదయాత్ర నిర్వహించి, అనంతరం ముట్టడి చేపట్టారు. ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ ములుగు జిల్లా కేంద్రంలో ఎస్సీ విద్యార్థుల కోసం కళాశాల హాస్టల్ మంజూరు చేయాలని, పెండింగ్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, తరగతి గదులు, ఫర్నిచర్, ప్రహరీ వంటి మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు జాగటి రవితేజ, కార్యదర్శి టి.ఎల్. రవి తదితరులు పాల్గొన్నారు.

