జర్నలిజం ఎంతో పవిత్రమైనది
ప్రజల పక్షాన నిలిచి వార్తలు రాయాలి
డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి
నడికూడలో నూతన ప్రెస్‌క్లబ్ ప్రారంభం
కాకతీయ, పరకాల : ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో, సమాజ శ్రేయస్సును కాపాడటంలో పాత్రికేయుల పాత్ర ఎంతో కీలకమని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి అన్నారు. జర్నలిజం ఎంతో పవిత్రమైనదని, నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ప్రెస్‌క్లబ్ ప్రతినిధులు నిష్పక్షపాతంగా ప్రజల పక్షాన నిలిచి వార్తలు రాయాలని సూచించారు. నడికుడ మండల కేంద్రంలోని మారుతి ఫంక్షన్‌హాల్‌లో నూతన ప్రెస్‌క్లబ్ ప్రారంభోత్సవం, కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. నడికుడ మండలంలోని జర్నలిస్టులంతా ఒకే తాటిపైకి వచ్చి ప్రెస్‌క్లబ్ ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు సమాజానికి మేలు జరిగేలా పాత్రికేయులు పనిచేయాలని కోరారు. అనంతరం ప్రెస్‌క్లబ్ నూతన అధ్యక్షుడు, కార్యదర్శితో పాటు కార్యవర్గ సభ్యులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో స్థానిక మండల అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ మండలాల ప్రెస్‌క్లబ్ ప్రతినిధులు, సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు.

