వైరా రోడ్ చర్చి.. వాణిజ్య కేంద్రంగా మారిందా?!
ఆంధ్ర వెల్ఫేర్ సొసైటీ పేరుతో చర్చి భవనం విక్రయంపై ఆరోపణలు
చర్చి స్థలంలో భారీ బహుళ అంతస్తుల నిర్మాణం
ప్రైవేటు వ్యక్తులకు భవనంలోని కొంత భాగం విక్రయించారంటున్న స్థానికులు
సొసైటీ రికార్డులపై అనుమానాలు..
కలెక్టర్ దృష్టి సారిస్తే వాస్తవాలు వెలుగులోకి?
కాకతీయ, ఖమ్మం బ్యూరో : దేవుడి సేవ కోసం ఉపయోగించాల్సిన చర్చి స్థలం.. వాణిజ్య కార్యకలాపాలకు వేదికగా మారిందా? చర్చి ఆస్తుల నిర్వహణకు నిర్దిష్ట నిబంధనలు ఉన్నప్పటికీ.. వాటిని పక్కనపెట్టి భవన నిర్మాణాలు చేపట్టి, అందులో కొంత భాగాన్ని ప్రైవేటు వ్యక్తులకు విక్రయించారన్న ఆరోపణలు ఖమ్మం నగరంలో చర్చనీయాంశంగా మారాయి. ఖమ్మం నగరం వైరా రోడ్డులోని ఆర్‌సీఎం చర్చి సమీపంలో ఉన్న చర్చి స్థలంలో భారీ బహుళ అంతస్తుల భవనం నిర్మించి.. అందులో కొంత భాగాన్ని విక్రయించినట్లు స్థానిక భక్తులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం వెనుక ‘ఆంధ్ర వెల్ఫేర్ సొసైటీ’ పేరుతో చేపట్టిన కార్యకలాపాలు ఏమిటి? సొసైటీకి ఆస్తుల విక్రయం చేసే అధికారం ఉందా? సంబంధిత అనుమతులు తీసుకున్నారా? అన్న ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. చర్చి ఆస్తులు సాధారణ వ్యక్తిగత ఆస్తుల మాదిరిగా విక్రయించడానికి వీలుంటుందా? ఒకవేళ విక్రయించాల్సి వస్తే సంబంధిత చర్చి యాజమాన్యం, డైసిస్ స్థాయిలో అవసరమైన అనుమతులు తీసుకున్నారా? ఆస్తి విక్రయం ద్వారా వచ్చిన నిధులను ఏ అవసరాలకు వినియోగించారు? అన్న అంశాలపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.
చర్చి స్థలం.. నిర్మాణం.. విక్రయం?
వైరా రోడ్డులోని ఆర్‌సీఎం చర్చికి పక్కనే చర్చికి సంబంధించిన స్థలం కొంతకాలంగా చర్చి యాజమాన్యాల పేరుతో కొనసాగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇటీవల అక్కడ భారీ బహుళ అంతస్తుల నిర్మాణం చేపట్టినట్లు సమాచారం. అయితే ఆ భవనంలో కొంత భాగాన్ని ప్రైవేటు వ్యక్తులకు విక్రయించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చర్చి ఆస్తిని ఏ ప్రాతిపదికన వాణిజ్య అవసరాలకు వినియోగించారు? నిర్మాణానికి ఎవరి అనుమతులు తీసుకున్నారు? భవనంలోని భాగాల విక్రయానికి సంబంధిత ధార్మిక సంస్థల అనుమతి ఉందా? అన్న అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.
ఆర్‌సీఎం చర్చిలు సాధారణంగా క్యాథలిక్ డైసిస్ ఆధ్వర్యంలో కొనసాగుతాయని.. ఆస్తుల నిర్వహణకు సంబంధించి ప్రత్యేక నిబంధనలు ఉంటాయని స్థానికులు చెబుతున్నారు. చర్చి స్థలాన్ని విక్రయించాలంటే ప్యారిష్ స్థాయిలో తీర్మానం, సంబంధిత బిషప్ లేదా డైసిస్ అనుమతి, ఆర్థిక అనుమతులు వంటి ప్రక్రియలు ఉండాల్సి ఉంటుందని వారు పేర్కొంటున్నారు. విలువైన ఆస్తుల విషయంలో మరిన్ని అనుమతులు అవసరమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే వైరా రోడ్డులోని ఆస్తికి సంబంధించి ఈ ప్రక్రియ మొత్తం పాటించారా? లేదా? అనేది అధికారిక రికార్డుల పరిశీలనలోనే తేలాల్సి ఉంది.
‘ఆంధ్ర వెల్ఫేర్ సొసైటీ’ పేరుతోనేనా?
ఈ వ్యవహారంలో ‘ఆంధ్ర వెల్ఫేర్ సొసైటీ’ పేరు కూడా తెరపైకి వస్తోంది. స్వచ్ఛంద కార్యక్రమాల నిర్వహణ కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని రిజిస్ట్రేషన్ శాఖ నుంచి ఈ సంస్థకు అనుమతులు పొందినట్లు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం తెలంగాణ రిజిస్ట్రేషన్ పోర్టల్‌లో సంస్థకు సంబంధించిన పాత రిజిస్ట్రేషన్ పత్రాలు, అనుమతులు స్పష్టంగా అందుబాటులో లేకపోవడం అనుమానాలకు తావిస్తోందని స్థానికులు అంటున్నారు. సొసైటీ రెన్యువల్ కోసం పలుమార్లు దరఖాస్తులు చేసినట్లు ఆన్‌లైన్ పోర్టల్‌లో వివరాలు కనిపిస్తున్నప్పటికీ.. సంబంధిత పత్రాలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడంపై వారు ప్రశ్నిస్తున్నారు. సంస్థకు ఆస్తులు కొనుగోలు, నిర్మాణాలు, విక్రయాలు చేపట్టే అధికారం ఏ మేరకు ఉంది? చర్చి ఆస్తికి, సొసైటీకి ఉన్న సంబంధం ఏమిటి? సొసైటీ పేరుతో ఏయే ఆస్తులు ఉన్నాయి? వాటి నిర్వహణ, విక్రయాలకు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? అన్న అంశాలపై రికార్డులను పరిశీలించాల్సిన అవసరం ఉంది.
కలెక్టర్ దృష్టి సారిస్తే..
చర్చి స్థలం, నిర్మాణ అనుమతులు, ఆస్తి విక్రయాలు, సొసైటీ రిజిస్ట్రేషన్, రెన్యువల్ వివరాలతోపాటు ఆస్తి వినియోగానికి సంబంధించిన రికార్డులను జిల్లా యంత్రాంగం పరిశీలిస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు. ముఖ్యంగా భవన నిర్మాణానికి అనుమతులు ఎవరు ఇచ్చారు? నిర్మాణం ఏ ప్రయోజనం కోసం చేపట్టారు? భవనంలోని కొంత భాగాన్ని ప్రైవేటు వ్యక్తులకు విక్రయించేందుకు అనుమతి ఉందా? విక్రయానికి సంబంధించి రిజిస్ట్రేషన్ జరిగిందా? జరిగితే ఏ సంస్థ లేదా వ్యక్తి పేరుతో జరిగింది? అన్న అంశాలను పరిశీలించాలని కోరుతున్నారు. అదేవిధంగా చర్చి ఆస్తుల విక్రయం జరిగి ఉంటే.. దానికి సంబంధించిన తీర్మానాలు, డైసిస్ అనుమతులు, ఆర్థిక అనుమతులు, విక్రయ పత్రాలు, వచ్చిన నిధుల వినియోగంపై కూడా విచారణ జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఆరోపణల్లో వాస్తవమెంత? నిబంధనలు ఉల్లంఘించారా? లేక అన్ని అనుమతులతోనే నిర్మాణం, విక్రయ ప్రక్రియ జరిగిందా? అన్నది అధికారిక దర్యాప్తుతోనే తేలనుంది. చర్చి పేరుతో ఉన్న ఆస్తి వాణిజ్య ప్రయోజనాలకు వినియోగించబడిందన్న ఆరోపణలు నిజమైతే.. ఇది కేవలం ఆస్తి వ్యవహారం కాకుండా భక్తుల విశ్వాసానికి సంబంధించిన అంశంగానూ మారే అవకాశం ఉంది. అందుకే జిల్లా కలెక్టర్ సమగ్రంగా రికార్డులు పరిశీలించి వాస్తవాలను వెలుగులోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు.

