చంతయ్యపల్లిలో సమస్యలకు తక్షణ పరిష్కారం
గౌరవెల్లి పూర్తి చేసి కాలువల ద్వారా సాగునీరు
చంతయ్యపల్లి స్టేజి నుంచి గ్రామానికి నెల రోజుల్లో రోడ్డు
ఆయిల్‌ఫామ్‌తో రైతులకు అధిక ఆదాయం : మంత్రి పొన్నం ప్రభాకర్
కాకతీయ, వరంగల్ బ్యూరో : ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని తక్షణమే పరిష్కరించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హనుమకొండ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలం చంతయ్యపల్లిలో నిర్వహించిన ‘పల్లె పల్లెకు పొన్నం అన్న.. పల్లె పల్లెలో ప్రజా పాలన’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ వద్ద ప్రజల నుంచి వినతులు స్వీకరించి, సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి కాలువల ద్వారా హుస్నాబాద్ నియోజకవర్గ రైతులకు సాగునీరు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ప్రాజెక్టు పూర్తి చేయకపోతే ఓట్లు అడగనని పేర్కొన్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్నందున ఆరుతడి పంటలతో పాటు ఆయిల్‌ఫామ్ సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించారు. జలసిరి కింద ఇంకుడు గుంతలకు రూ.6,500, ఫామ్ పాండ్లకు రూ.1.30 లక్షల వరకు ప్రభుత్వం సాయం చేస్తుందని తెలిపారు. గ్రామంలో చంతయ్యపల్లి స్టేజి నుంచి ప్రధాన రహదారి పనులను నెల రోజుల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అంతర్గత సీసీ రోడ్లు, అంగన్‌వాడీ భవనం, పంచాయతీ భవనంలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి అవసరమైన వసతులు కల్పిస్తామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ భూక్యా సునీత, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

