ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
ఇంటి నిర్మాణ అనుమతికి రూ.13వేల లంచం డిమాండ్
రూ.20 వేలు అడిగి రూ.13 వేలకు బేరం
మరో కార్యదర్శి ఫోన్‌పే ఖాతాకు నగదు బదిలీ
ఏసీబీకి చిక్కిన లింగాయపల్లి కార్యదర్శి వరలక్ష్మి
కాకతీయ, మంచిర్యాల : ఇంటి నిర్మాణానికి అనుమతి, కొత్తగా నిర్మించిన ఇంటికి ఇంటి నంబర్ కేటాయించేందుకు రూ.13 వేల లంచం తీసుకుంటూ మంచిర్యాల జిల్లా జన్నారం మండలం లింగాయపల్లి పంచాయతీ కార్యదర్శి జె. వరలక్ష్మి ఏసీబీ అధికారులకు చిక్కారు. శుక్రవారం ఆదిలాబాద్ యూనిట్ ఏసీబీ అధికారులు ఈ దాడి నిర్వహించారు. ఏసీబీ వివరాల ప్రకారం.. ఫిర్యాదుదారుడి నుంచి తొలుత రూ.20 వేలు డిమాండ్ చేసిన వరలక్ష్మి, అనంతరం రూ.13 వేలకు అంగీకరించారు. ట్రాప్ సమయంలో నగదు తీసుకోకుండా ఫోన్‌పే ద్వారా చెల్లించాలని సూచించారు. మరో పంచాయతీ కార్యదర్శి లావణ్యకు చెందిన ఫోన్‌పే నంబర్‌ను ఇచ్చారు. ఆమె సూచన మేరకు ఫిర్యాదుదారుడు రూ.13 వేలను ఆ ఖాతాకు బదిలీ చేశారు. లంచం డిమాండ్, చెల్లింపునకు సంబంధించిన సంభాషణలను ఏసీబీ అధికారులు రికార్డు చేశారు. అనంతరం వరలక్ష్మిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి కరీంనగర్‌లోని ఎస్‌పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు. కేసు దర్యాప్తులో ఉంది. ఫిర్యాదుదారుడి వివరాలను భద్రతా కారణాల దృష్ట్యా గోప్యంగా ఉంచినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

