దోచుకుందాం.. రా!
వరంగల్ బల్దియాలో అవినీతికి పరాకాష్ట
పనులు లేకున్నా బిల్లుల పంపకానికి స్కెచ్
కాంట్రాక్టర్లకు అప్పనంగా బిల్లుల ఆశలు
ముందస్తుగానే కమీషన్లు లాగేస్తున్నారన్న ఆరోపణలు
ఆలస్యంగా వెలుగులోకి వస్తున్న పాత బాగోతం
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : గ్రేటర్ వరంగల్ మహానగర పాలక సంస్థలో అవినీతి వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పనులు చేయకుండానే బిల్లులు.. ప్రొసీడింగ్స్ లేకుండానే పనులు చేసినట్లు రికార్డులు.. ముందుగానే కమీషన్లు.. ఆ తర్వాత భారీగా బిల్లులు.. ఇదీ బల్దియాలో కొందరు అధికారులు, కాంట్రాక్టర్ల మధ్య సాగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యవహారం. కొన్నేళ్ల క్రితం జరిగిన ఈ బాగోతం తాజాగా వెలుగులోకి రావడంతో బల్దియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పనులు చేయకున్నా బిల్లులు ఇప్పిస్తామంటూ కాంట్రాక్టర్లను ఆకర్షించి, అందులో నుంచి ముందుగానే కమీషన్లు తీసుకునే విధానం అమలైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పార్కుల పనుల పేరుతో రూ.5 లక్షల వ్యవహారం
హనుమకొండ ప్రాంతంలోని రెండు, మూడు పార్కుల్లో అభివృద్ధి పనుల పేరుతో అప్పట్లో జరిగిన వ్యవహారమే ఇందుకు ఉదాహరణగా బల్దియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆయా పార్కుల్లో పనులు చేపట్టేందుకు సరైన ప్రొసీడింగ్స్ లేకపోయినా.. వాటిని రికార్డుల్లో చూపించి బిల్లులు చేయించేలా ఓ ఇంజినీరింగ్ అధికారి ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఓ కాంట్రాక్టర్‌ను సంప్రదించి రూ.5 లక్షలు కమీషన్‌గా ఇవ్వాలని సూచించినట్లు సమాచారం. ముందుగానే ఆ మొత్తాన్ని చెల్లిస్తే.. అనంతరం దానికి రెండు, మూడు రెట్లు విలువైన బిల్లులు ఇప్పిస్తామనే ఒప్పందం కుదిరినట్లు బల్దియా వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరో కాంట్రాక్టర్ నుంచి కూడా ఇదే తరహాలో డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే వ్యవహారం పూర్తిగా కార్యరూపం దాల్చకముందే అడ్డంకులు ఎదురవడంతో అసలు బాగోతం నిలిచిపోయినట్లు సమాచారం.
ప్రొసీడింగ్స్ లేకుండా బిల్లులా?
మున్సిపల్ సంస్థలో ఏదైనా అభివృద్ధి పనిని చేపట్టాలంటే పరిపాలనా అనుమతులు, సాంకేతిక అనుమతులు, పనుల ప్రొసీడింగ్స్ తదితర ప్రక్రియలు తప్పనిసరి. పనులు పూర్తయిన తర్వాత కొలతలు నమోదు చేసి, సంబంధిత అధికారుల ధ్రువీకరణతోనే బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే పార్కుల వ్యవహారంలో అసలు ప్రొసీడింగ్స్ లేకుండానే పనులు చేసినట్లు రికార్డులు సృష్టించేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఇదే నిజమైతే.. ఒకటి రెండు అధికారుల నిర్ణయంతో మాత్రమే ఇది సాధ్యమయ్యే వ్యవహారం కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫైలు ఏయే దశల్లో కదిలింది? ఎవరు పరిశీలించారు? ఎవరు ఆమోదించారు? బిల్లులు తయారయ్యాయా? చెల్లింపులు జరిగాయా? అన్నది తేలాల్సి ఉంది.
కమీషన్ ముందే.. బిల్లు తర్వాత?
కాంట్రాక్టర్లకు ముందుగానే కమీషన్ నిర్ణయించి, ఆ తర్వాత బిల్లులు ఇప్పిస్తామంటూ ఆశ చూపడం బల్దియాలో కొందరు అధికారుల అవినీతి తీరుకు నిదర్శనమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పని విలువ కంటే బిల్లులో ఎంత మొత్తం వస్తుంది? అందులో ఎవరి వాటా ఎంత? అన్న లెక్కలతో వ్యవహారం నడుస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో ముందస్తుగా రూ.5 లక్షలు ఇచ్చిన కాంట్రాక్టర్ ఇటీవలే ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించేలా సెటిల్‌మెంట్ జరిగినట్లు బల్దియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి అధికారికంగా ఎలాంటి నిర్ధారణ వెలువడలేదు. ఈ బాగోతానికి సంబంధించిన ఫైలు అప్పట్లో విచారణాధికారుల దృష్టికి వెళ్లకుండా దాచిపెట్టారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. నిజంగానే అలాంటి ఫైలు ఉంటే.. అది ప్రస్తుతం ఎక్కడుంది? దాన్ని ఎవరు నిర్వహించారు? విచారణకు ఎందుకు సమర్పించలేదు? అన్నది తేలాల్సి ఉంది. అప్పటి ఇంజినీరింగ్ విభాగంలో పనిచేసిన అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్లు ఎవరు? పార్కుల పనులకు ఎంత మొత్తంలో అంచనాలు రూపొందించారు? అసలు పనులు జరిగాయా? జరిగితే కొలతలు ఎవరు నమోదు చేశారు? బిల్లులు ఎవరు రూపొందించారు? చెల్లింపులు జరిగాయా? అన్న వివరాలను బయటకు తీస్తే అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
విచారణ జరిగితేనే వాస్తవాలు
కొన్నేళ్ల క్రితం జరిగినట్లు చెబుతున్న ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాలని బల్దియా వర్గాల్లో డిమాండ్ వినిపిస్తోంది. సంబంధిత ఫైళ్లు, ఎంబీలు, వర్క్ ఆర్డర్లు, ప్రొసీడింగ్స్, బిల్లులు, చెల్లింపు వివరాలు, అధికారుల నోట్‌ఫైళ్లను పరిశీలిస్తే ఆరోపణల్లో వాస్తవమెంత అనేది తేలిపోతుంది. ఆరోపణలు నిజమైతే బాధ్యులపై చర్యలు తీసుకోవడంతోపాటు ప్రభుత్వ నిధుల రికవరీకి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఇప్పటికే బల్దియాలో బిల్లుల చెల్లింపులపై అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. పాత ఫైళ్లను కూడా వెలికితీసి పరిశీలించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లేదంటే “పని చేయకుండానే బిల్లు.. బిల్లు చేయకముందే కమీషన్” అన్న ఆరోపణలు మరింత బలపడే అవకాశం ఉంది.

