కొండా ఫ్యామిలీకి రేవూరిని విమర్శించే హక్కులేదు
సుస్మిత వ్యాఖ్యలను ఖండించిన గీసుగొండ మండల అధ్యక్షుడు శివ
కాకతీయ, గీసుగొండ : పరకాల నియోజకవర్గాన్ని వదిలి వెళ్లిన కొండా సుస్మితకు ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిని విమర్శించే నైతిక హక్కు లేదని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దాడి శివ అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే రేవూరిపై సుస్మిత చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ శనివారం గీసుగొండలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం, ఎమ్మెల్యే నాయకత్వంలో నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. వాటిని చూసి ఓర్వలేకే సుస్మిత అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజల కోసం పనిచేస్తున్న నాయకులపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు. సుస్మిత వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని, ఆమెపై పార్టీ అధిష్ఠానం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించడంతో పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరారు. సమావేశంలో మాజీ ఎంపీపీ భీమగాని సౌజన్య, డీసీసీ ప్రధాన కార్యదర్శి తుమ్మనపల్లి శ్రీనివాస్, మార్కెట్ డైరెక్టర్ ఆకుల రుద్రప్రసాద్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

