ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి!
నా పనితనమే విమర్శలకు సమాధానం
మళ్లీ నాకే ఎమ్మెల్యే టికెట్ ప్రకటించడం ఊహించలేదు
ప్రజల స్పందన చూసే సీఎం నిర్ణయం
స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో ఎమ్మెల్యే రేవూరి
కాకతీయ, గీసుగొండ : ‘‘ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి.. నా వయసుపై విమర్శలు చేస్తున్న వారికి నా పనితనమే సమాధానం’’ అని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. గీసుగొండ మండలంలోని ఎస్‌ఎస్ ఫంక్షన్‌హాల్‌లో శనివారం గీసుగొండ, సంగెం మండలాలతో పాటు గ్రేటర్ వరంగల్ 15, 16, 17వ డివిజన్ల లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విమర్శలకు ప్రతి విమర్శ చేసి సమయం వృథా చేసుకోనని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని తెలిపారు. ఇటీవల పరకాలలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మళ్లీ తనకే ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నట్లు ప్రకటించడం తాను ఊహించలేదన్నారు. సమావేశానికి భారీగా తరలివచ్చిన ప్రజల స్పందనను చూసిన తర్వాతే సీఎం ఈ నిర్ణయం ప్రకటించారని చెప్పారు. ప్రజల అభిమానం, ఆశీర్వాదమే తనకు బలమన్నారు. అనంతరం అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

