రౌడీషీటర్లు, పాత నేరస్తులపై నిరంతర నిఘా
నేరం తర్వాత దర్యాప్తు కంటే ముందస్తు చర్యలే కీలకం
డ్రగ్స్ విక్రయాలు, సరఫరాపై ఉక్కుపాదం
సైబర్ నేరాలపై విస్తృత అవగాహన కల్పించాలి
పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి
వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత
కాకతీయ, వరంగల్ బ్యూరో : నేరం జరిగిన తర్వాత దర్యాప్తు చేయడం కంటే ముందస్తు చర్యలతో నేరాలను అడ్డుకోవడమే కీలకమని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత అన్నారు. రౌడీషీటర్లు, పాత నేరస్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. శనివారం కమిషనరేట్ కార్యాలయంలో నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించిన వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ వారి సమస్యలపై తక్షణమే స్పందించాలని సూచించారు. డ్రగ్స్ వినియోగం, విక్రయాలు, సరఫరా మార్గాలపై పక్కా సమాచారం సేకరించి కట్టడి చేయాలని ఆదేశించారు. యువతకు మత్తు పదార్థాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించాలన్నారు. సైబర్ నేరాలపై విద్యార్థులు, యువత, వృద్ధులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అనుమానాస్పద ఫోన్‌కాల్స్, లింకులు, ఆన్‌లైన్ లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండేలా ప్రచారం చేయాలన్నారు. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు సకాలంలో న్యాయం అందించాలని ఆదేశించారు. సమావేశంలో డీసీపీలు అంకిత్‌కుమార్, దారా కవిత, రాజమహేంద్ర నాయక్, కిషన్‌సింగ్, అదనపు డీసీపీలు సురేష్‌కుమార్, బాలస్వామి, ఏసీపీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

