తండాల అభివృద్ధికి మంత్రి కొండా ప్రత్యేక చొరవ
గీసుగొండ తండాలకు రూ.7.01 కోట్ల నిధులు
సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీ హాళ్లకు కేటాయింపు
కాంగ్రెస్ నాయకుడు రడం భరత్‌కుమార్
కాకతీయ, గీసుగొండ : గీసుగొండ మండలంలోని గిరిజన తండాల అభివృద్ధికి మంత్రి కొండా సురేఖ ప్రత్యేక చొరవ తీసుకుని రూ.7,01,04,000 నిధులు మంజూరు చేయించారని కాంగ్రెస్ నాయకుడు రడం భరత్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం శనివారం జీవో జారీ చేసిందని చెప్పారు. మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తండాల్లో మౌలిక వసతుల కల్పనపై మంత్రి ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. మంజూరైన నిధుల్లో సీసీ రోడ్లకు రూ.5,73,74,000, సీసీ డ్రైనేజీలకు రూ.82,30,000, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి రూ.45 లక్షలు కేటాయించినట్లు వివరించారు. నిధులతో తండాల్లో మౌలిక వసతులు మెరుగుపడి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. గిరిజనులపై ఉన్న అభిమానంతో మంత్రి కొండా సురేఖ తండాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయించారని, ఇందుకు గీసుగొండ మండల ప్రజలు, గిరిజన తండాల నాయకులు, కార్యకర్తలు కృతజ్ఞతలు తెలుపుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచులు కమల బిక్షపతి, అమృత బిక్షపతి, రాఘవేంద్ర, పేర్ల శ్రావణ్‌తో పాటు గిరిజన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

