క్వారీల వ్యవహారంలో నాపై దాడికి స్కెచ్
మూడు కార్లతో వెంబడించి వాహనాన్ని ఢీకొట్టారు
లారీ కింద పడేసి చంపే ప్రయత్నం చేశారు
నాకు ప్రాణహాని ఉంది.. పోలీసులు రక్షణ కల్పించాలి
బీఆర్ఎస్ నేత చందా చక్రపాణి సంచలన ఆరోపణలు
కాకతీయ, ములుగు ప్రతినిధి : క్వారీల వ్యవహారంలో తనపై ప్రాణాంతక దాడికి కుట్ర జరిగిందని మాజీ రెక్కో చైర్మన్ చందా చక్రపాణి ఆరోపించారు. ములుగు జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చెరుకూరు, టేకులగూడెం ప్రాంతాల్లోని మూడు ఇసుక క్వారీల వ్యవహారంలో తనను లక్ష్యంగా చేసుకుని కొందరు దాడికి పాల్పడ్డారని తెలిపారు. గ్రామాల ప్రజల సమ్మతితో సొసైటీలు ఏర్పాటు చేసి, వారి అనుమతులు, పత్రాల ఆధారంగానే క్వారీలకు అనుమతులు తీసుకున్నానని చెప్పారు. 2019 నుంచి 2024 వరకు అనుమతుల కోసం ఇబ్బందులు ఎదుర్కొని, చివరకు కోర్టును ఆశ్రయించి అనుమతులు పొందినట్లు వివరించారు. ఓ పంచాయతీ పేరుతో తనను పిలిచి మాట్లాడిన అనంతరం అదే రోజు సాయంత్రం తాడ్వాయి దాటి కొండపర్తి స్టేజ్ సమీపంలో మూడు కార్లతో వెంబడించారని ఆరోపించారు. ఒక కారు తన వాహనానికి అడ్డంగా పెట్టగా, వెనుక నుంచి వచ్చిన మరో రెండు కార్లు ఢీకొట్టాయని తెలిపారు. అనంతరం తన కారును ధ్వంసం చేసి దాడి చేశారని, లారీ కింద పడేసి హత్య చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఓ సందులోకి వెళ్లి తప్పించుకున్నానని చెప్పారు. తనపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రాణహాని ఉన్నందున పోలీసు రక్షణ కల్పించాలని చక్రపాణి కోరారు. తనపై దాడి వెనుక రాజకీయ ప్రోత్సాహం ఉందని, బీఆర్ఎస్ నాయకుడిననే కారణంతో వ్యాపారాలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

