ఓటు హక్కుపై ప్రతి ఓటరూ అప్రమత్తంగా ఉండాలి
గీసుగొండ మండలంలో 11,824 మంది ఓటర్లకు నోటీసులు
2002 నాటి వివరాలు, ప్రస్తుత వివరాల్లో వ్యత్యాసాలున్న వారికి జారీ
ఈనెల 27 నుంచి బీఎల్‌ఓలు, జీపీఓలు అందుబాటులో
ఓటర్లు అవసరమైన పత్రాలు సమర్పించాలి
తహసీల్దార్ ఎం.డి. రియాజుద్దీన్
కాకతీయ, గీసుగొండ : రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు విషయంలో ప్రతి ఓటరూ అప్రమత్తంగా ఉండాలని గీసుగొండ తహసీల్దార్ ఎం.డి. రియాజుద్దీన్ సూచించారు. ఎస్‌ఐఆర్ కార్యక్రమంపై మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో బీఎల్‌ఓలు, జీపీఓలతో సోమవారం అవగాహన సమావేశం నిర్వహించారు. మండలంలోని 52 పోలింగ్ బూత్‌ల పరిధిలో వివిధ కారణాలతో 11,824 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయనున్నట్లు తహసీల్దార్ తెలిపారు. 2002లో ఓటరుగా నమోదైన వివరాలకు, ప్రస్తుతం ఉన్న వివరాలకు వ్యత్యాసం ఉన్న ప్రతి ఒక్కరికీ నోటీసులు అందజేస్తామన్నారు. నోటీసులు అందుకున్న ఓటర్లు తమ ఓటు హక్కును కొనసాగించేందుకు ఎన్నికల సంఘం సూచించిన గుర్తింపు కార్డులు, ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒకదాన్ని బీఎల్‌ఓలకు సమర్పించాలని సూచించారు. ఈనెల 27 నుంచి గ్రామ పంచాయతీ, వార్డు కార్యాలయాల్లో బీఎల్‌ఓలు, జీపీఓలు అందుబాటులో ఉంటారని తెలిపారు. గ్రేటర్ వరంగల్‌లోని 15, 16, 17 డివిజన్లతో పాటు గీసుగొండ మండలంలోని అన్ని గ్రామాల్లో నోటీసులు అందుకున్న ఓటర్లు పత్రాలు సమర్పించి, ఫొటో కూడా దిగాలని సూచించారు. కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్ కె. రామన్న, బీఎల్‌ఓ సూపర్‌వైజర్లు ఉదయశ్రీ, సాంబయ్య, మధుచందర్, రాజు తదితరులు పాల్గొన్నారు.

