epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌!
నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం
భూ వివాదాల కేసుల్లో ఎస్‌ఓపీనే ప్రామాణికం
వరంగల్‌ పోలీసింగ్‌ వేరు.. అర్బన్‌, రూరల్‌ బ్యాలెన్సే ఇక్క‌డ‌ కీలకం
గంజాయిపై ఉక్కుపాదం.. ‘సంఘమిత్ర’లతో సమరమే!
ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ.. అవసరమైన చోట నిర్ణయం
ప్రజల సేఫ్టీనే మొదటి లక్ష్యం.. శాఖలతో కలిసి ముందుకు
ఫేమ్‌ కోసం కాదు.. ఫలితం కోసం ప‌నిచేస్తా
డిజిట‌ల్ మీడియా ప్ర‌తినిధుల‌తో చిట్‌చాట్‌లో వరంగల్‌ సీపీ శ్వేతారెడ్డి

‘‘పోలీస్‌ అధికారిగా నాకు పేరు రావాలి.. ఫేమ్‌ రావాలి అనే ఆలోచన లేదు. నేను చేసే పనికి ఫలితం కనిపించాలి. ప్రజలకు భద్రత ఉందనే నమ్మకం కలగాలి. నేరస్తులకు చట్టం పట్ల భయం ఉండాలి. అదే నా పోలీసింగ్‌ నిర్వచనం’’.. వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ శ్వేతారెడ్డి తన వర్క్‌ స్టైల్‌ను ఆవిష్కరించారు. అర్బన్‌, రూరల్‌ ప్రాంతాల ప్రత్యేకతలను సమన్వయం చేసుకుంటూ వరంగల్‌ పోలీసింగ్‌కు ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తున్నానని చెప్పారు. గంజాయి, రౌడీయిజం, సైబర్‌ క్రైం, ట్రాఫిక్‌, భూ వివాదాలు వంటి అంశాలతోపాటు సాంకేతికత వినియోగం, శాఖల మధ్య సమన్వయం, ప్రజల భాగస్వామ్యానికీ ప్రాధాన్యం ఇస్తున్నట్లు వెల్లడించారు. డిజిటల్‌ మీడియా ప్రతినిధులు నిర్వ‌హించిన చిట్‌చాట్‌లో వ‌రంగ‌ల్ సీపీ శ్వేతారెడ్డి వ‌రంగ‌ల్ పోలీస్ క‌మిష‌న‌రేట్‌లో అమ‌లు చేస్తున్న పోలీస్ విధానాల‌పై కొన్నింటిని చిట్‌చాట్‌లో వెల్ల‌డించారు. ఆ వివ‌రాలు సీపీ మాట‌ల్లోనే..

గంజాయిపై ఉక్కుపాదం.. ‘సంఘమిత్ర’లతో సమరమే!

‘‘గంజాయి విషయంలో నేను చాలా సీరియస్‌గా ప‌నిచేస్తున్నాం. ఇది కేవలం పోలీసుల సమస్యగా చూడను. ఒక యువకుడు మత్తుకు బానిస అయితే దాని ప్రభావం ఒక్క వ్యక్తిపైనే కాదు.. మొత్తం కుటుంబంపైన, సమాజంపైన పడుతుంది. అందుకే నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ గంజాయి వినియోగం, సరఫరాపై ప్రత్యేక నిఘా పెట్టాం. పదేపదే గంజాయి కేసుల్లో పట్టుబడుతున్నవారి కదలికలను నిశితంగా గమనిస్తున్నాం. అవసరమైన చోట రౌడీషీట్లు కూడా ఓపెన్‌ చేస్తున్నాం. అయితే పోలీసులు ఎంత పనిచేసినా ప్రజల సహకారం లేకుండా గంజాయి సరఫరాను పూర్తిగా అరికట్టడం కష్టం. అందుకే మహిళా సంఘాలను ‘సంఘమిత్రలు’గా భాగస్వాములను చేస్తున్నాం. ప్రతి గ్రామంలో మహిళా సంఘాలు ఉండటంతో క్షేత్రస్థాయిలో సమాచారం సేకరించడంతో పాటు యువతను మత్తు నుంచి దూరంగా ఉంచే అవగాహన పెంచవచ్చు. గంజాయి సరఫరా చేసే వ్యక్తులు, ప్రాంతాలు, వాహనాలపై పక్కా సమాచారం ఇస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. సమాచారం ఇచ్చేవారి వివరాలు గోప్యంగా ఉంచుతాం.

రౌడీయిజానికి నో ఛాన్స్‌.. నేర చరిత్రపై నిఘా

వరంగల్‌లో రౌడీయిజానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వం. నేర చరిత్ర ఉన్న వ్యక్తులు మళ్లీ అదే మార్గంలోకి వెళ్లకుండా వారి కదలికలపై నిరంతరం నిఘా ఉంటుంది. అవసరమైన చోట చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. రౌడీయిజం అనేది కేవలం ఒక వ్యక్తి చేసే నేరం కాదు.. దాని ప్రభావం చుట్టుపక్కల ప్రజలపై పడుతుంది. ఒక కాలనీలో కొందరు వ్యక్తులు భయాందోళనలు సృష్టిస్తే సాధారణ ప్రజలు స్వేచ్ఛగా జీవించే పరిస్థితి ఉండదు. అలాంటి వాతావరణాన్ని సహించేది లేదు. నేరం చేసిన తర్వాత చర్య తీసుకోవడం ఒక విధానం అయితే.. నేరం పునరావృతం కాకుండా ముందుగానే గుర్తించడం మరో ముఖ్యమైన విధానం. నేను రెండింటికీ సమాన ప్రాధాన్యం ఇస్తాను. నేర చరిత్ర ఉన్న వ్యక్తులపై నిఘా, పెట్రోలింగ్‌, స్థానిక సమాచారం సేకరణను బలోపేతం చేస్తాం. చట్టాన్ని అతిక్రమిస్తే ఎంత ప్రభావం ఉన్న వ్యక్తి అయినా నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తాం’’ అని సీపీ స్పష్టం చేశారు.

మిల్స్‌ కాలనీపై ప్రత్యేక ఫోకస్‌.. క్రైం కంట్రోల్‌ ముఖ్యం

ప్రతి పోలీస్‌స్టేషన్‌కు ఒకే విధమైన సమస్యలు ఉండవు. ఏ ప్రాంతంలో ఎలాంటి నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయో ముందుగా తెలుసుకోవాలి. మిల్స్‌ కాలనీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో క్రైం కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో అక్కడ ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. అదనపు ఎస్‌ఐని నియమించి క్రైం కంట్రోల్‌, పెట్రోలింగ్‌, నిఘాను మరింత బలోపేతం చేస్తున్నాం. నాకు పోలీసింగ్‌ అంటే కేవలం కేసులు నమోదు చేయడం కాదు.. కేసులు ఎందుకు జరుగుతున్నాయో తెలుసుకోవడం, వాటిని ముందుగానే నియంత్రించే వ్యవస్థను ఏర్పాటు చేయడం. మిల్స్‌ కాలనీతో పాటు మట్వాడ, ఇంతేజార్‌గంజ్‌ ప్రాంతాల్లో క్రైం కేసులు ఎక్కువగా ఉంటే.. కేయూ, హసన్‌పర్తి ప్రాంతాల్లో భూ వివాదాలకు సంబంధించిన కేసులు అధికంగా ఉన్నాయి. అందుకే సమస్య ఉన్న చోటుకు తగ్గట్టుగా పోలీసింగ్‌ ఉండాలి. ప్రతి స్టేషన్‌కు ఒకే ఫార్ములా కాకుండా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వ్యూహం రూపొందిస్తున్నాం’’ అని సీపీ వివరించారు.

సైబర్‌ నేరాల్లో బాధితుడికి న్యాయం.. దర్యాప్తే కీలకం

సైబర్‌ క్రైం ప్రస్తుతం ప్రతి ప్రాంతానికీ సవాలుగా మారింది. వరంగల్‌ కమిషనరేట్‌లోనూ సైబర్‌ నేరాల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఒక వ్యక్తి సైబర్‌ మోసానికి గురైనప్పుడు డబ్బు పోవడంతో పాటు మానసికంగా కూడా తీవ్రంగా ఇబ్బంది పడతారు. అందుకే బాధితుడికి న్యాయం జరిగేలా కేసును ప్రాపర్‌గా ఇన్వెస్టిగేట్‌ చేయడంపై దృష్టి పెడుతున్నాం. సైబర్‌ నేరాల్లో సమయం చాలా కీలకం. కేసు నమోదైన తర్వాత దర్యాప్తును వేగంగా ముందుకు తీసుకెళ్లాలి. ఆధారాలను సేకరించడం, నేరానికి సంబంధించిన లింకులను గుర్తించడం వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. పోలీసింగ్‌లో సాంకేతికత పెరుగుతున్న కొద్దీ నేరాల స్వభావం కూడా మారుతోంది. అందుకు అనుగుణంగా మన దర్యాప్తు విధానం కూడా మారాలి. సైబర్‌ నేరాల విషయంలో ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు నేరం జరిగినప్పుడు వెంటనే పోలీసులను సంప్రదించేలా చైతన్యం కల్పించాలి.

స్టేషన్‌ వారీగా క్రైం మ్యాపింగ్‌..

వరంగల్‌ కమిషనరేట్‌ మొత్తం ఒకే రకమైన ప్రాంతం కాదు. ప్రతి పోలీస్‌స్టేషన్‌కు తనదైన క్రైం ప్యాటర్న్‌ ఉంటుంది. అందుకే స్టేషన్‌ వారీగా నమోదవుతున్న కేసుల స్వభావాన్ని పరిశీలిస్తున్నాం. మిల్స్‌ కాలనీ, మట్వాడ, ఇంతేజార్‌గంజ్‌ ప్రాంతాల్లో క్రైం కేసులు ఎక్కువగా ఉంటే.. కేయూ, హసన్‌పర్తి ప్రాంతాల్లో భూ వివాదాలు అధికంగా ఉన్నాయి. ఈ సమాచారాన్ని కేవలం గణాంకాలుగా చూడటం లేదు. ఆ గణాంకాల వెనుక ఉన్న కారణాలను గుర్తించాలి. ఏ ప్రాంతంలో ఏ సమయంలో ఎలాంటి నేరాలు జరుగుతున్నాయి? ఎలాంటి వ్యక్తులు ఎక్కువగా నేరాలకు పాల్పడుతున్నారు? వంటి అంశాలను పరిశీలించి నివారణ చర్యలు చేపడుతున్నాం. ఇది క్రైం మ్యాపింగ్‌ ద్వారా మరింత స్పష్టమవుతుంది. నా దృష్టిలో మంచి పోలీసింగ్‌ అంటే నేరం జరిగిన తర్వాత స్పందించడం మాత్రమే కాదు.. నేరం జరిగే అవకాశాలను ముందుగానే గుర్తించి అడ్డుకోవడం. అందుకే డేటా ఆధారిత పోలీసింగ్‌కు ప్రాధాన్యం ఇస్తున్నాం.

ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ.. అవసరమైన చోట నిర్ణయం

వరంగల్‌ నగరంలో ట్రాఫిక్‌ సమస్యను ఒక్కరోజులో పరిష్కరించలేం. ఇది నిరంతరం కొనసాగుతున్న అంశం. అయితే సమస్య ఉన్న ప్రాంతాన్ని గుర్తించి అవసరమైన నిర్ణయాలు తీసుకోవాలి. యూటర్న్‌లు, ఫ్రీ లెఫ్ట్‌లు, రోడ్డు సేఫ్టీ వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. కరుణాపురంలో వైన్స్‌కు పెద్ద పర్మిట్‌ రూమ్‌ ఉండటంతో ట్రాఫిక్‌ జామ్‌లు, ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనిపై ఎక్సైజ్‌ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని మూడు యూటర్న్‌లను మూసివేశాం. దాని ఫలితంగా ప్రస్తుతం ట్రాఫిక్‌ సాఫీగా సాగుతోంది. నాకు ఒక విషయం స్పష్టంగా ఉంది.. ట్రాఫిక్‌ విషయంలో పోలీసులు మాత్రమే పనిచేస్తే సరిపోదు. వాహనదారులు నిబంధనలు పాటించాలి. ప్రజలు కూడా సహకరించాలి. రోడ్డు భద్రత అనేది అందరి బాధ్యత. ఎక్కడ సమస్య ఉంటే అక్కడి పరిస్థితిని అధ్యయనం చేసి దశలవారీగా పరిష్కరించుకుంటూ వెళ్తాం.

ప్రజల సేఫ్టీనే మొదటి లక్ష్యం.. శాఖలతో కలిసి ముందుకు

నా పోలీసింగ్‌లో ప్రజల భద్రతకు మొదటి ప్రాధాన్యం. ట్రాఫిక్‌, ఫ్రీ లెఫ్ట్‌లు, ఫుట్‌పాత్‌ ఆక్రమణలు వంటి సమస్యలను ఒక్కసారిగా పరిష్కరించలేకపోయినా విడతల వారీగా ముందుకు వెళ్తాం. పోలీసు శాఖ ఒక్కటే అన్ని సమస్యలను పరిష్కరించలేదు. కొన్ని సమస్యలకు మున్సిపల్‌ కార్పొరేషన్‌ సహకారం అవసరం.. మరికొన్నింటికి ఎక్సైజ్‌, రెవెన్యూ శాఖల సమన్వయం అవసరం. ఇప్పటికే కార్పొరేషన్‌ అధికారులతో సమావేశం నిర్వహించాం. శాఖల మధ్య సమన్వయం లేకపోతే ఒక శాఖ తీసుకున్న నిర్ణయం మరో సమస్యకు దారితీయవచ్చు. అందుకే అందరినీ కలుపుకొని పనిచేయాలి. అదే సమయంలో ప్రజల భాగస్వామ్యం కూడా చాలా ముఖ్యం. అధికారులు తమ వంతు బాధ్యత నిర్వర్తించినా ప్రజలు సహకరించకపోతే శాశ్వత పరిష్కారం సాధ్యం కాదు. పోలీసింగ్‌ అంటే పోలీస్‌ స్టేషన్‌ గోడల మధ్య జరిగే వ్యవహారం కాదు.. ప్రజలతో కలిసి నడిచే వ్యవస్థ. ఆ దిశగానే నా పని తీరు ఉంటుంది.

భూ వివాదాల్లో ఎస్‌ఓపీనే ప్రామాణికం

భూ వివాదాలు చాలా సున్నితమైన అంశాలు. ఇలాంటి సమస్యల్లో పోలీసులు, రెవెన్యూ అధికారులు ఎవరి పరిధిలో వారు నిబంధనల ప్రకారం వ్యవహరించాలి. ప్రభుత్వం, పోలీసు శాఖ రూపొందించిన ప్రత్యేక స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌నే ప్రామాణికంగా తీసుకోవాలని అధికారులకు స్పష్టంగా చెబుతున్నాను. ఎవరైనా ఏకపక్షంగా జోక్యం చేసుకుంటే సమస్య మరింత జటిలమవుతుంది. అందుకే ఎస్‌ఓపీ ప్రకారం ముందుకు వెళ్లడం ముఖ్యం. నేను కూడా అదే విధానాన్ని పాటిస్తాను. చట్టం ఇచ్చిన పరిధిలోనే పోలీసింగ్‌ ఉంటుంది. ఎవరికి అనుకూలంగా, ఎవరికి వ్యతిరేకంగా పనిచేయడం నా విధానం కాదు. ఆధారాలు, నిబంధనలు, చట్టపరమైన ప్రక్రియ ఆధారంగానే నిర్ణయాలు ఉంటాయి. భూ వివాదాల్లో పారదర్శకత ఉంటేనే ప్రజలకు పోలీసు వ్యవస్థపై నమ్మకం పెరుగుతుంది. నిబంధనలు అతిక్రమించే వారిపై చర్యలు తప్పవు.

సీసీ కెమెరాలపై నిఘా.. ప్రతి ప్రాంతం మరింత సేఫ్‌గా

నేర నియంత్రణలో సీసీ కెమెరాలు చాలా కీలకంగా మారాయి. ఒక నేరం జరిగిన తర్వాత నిందితుడిని గుర్తించడంలోనే కాదు.. నేరం ఎలా జరిగింది అనే విషయాన్ని తెలుసుకోవడంలోనూ కెమెరాలు ఉపయోగపడతాయి. అందుకే నగరంలోని కాలనీలు, ముఖ్యమైన ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరుపై ప్రత్యేక దృష్టి పెట్టాం. కెమెరాలు ఏర్పాటు చేసి వదిలేయడం కాదు.. అవి పనిచేస్తున్నాయా? నిర్వహణ సక్రమంగా జరుగుతోందా? అనే విషయాలను నిరంతరం పరిశీలించాలి. సంబంధిత పోలీస్‌స్టేషన్ల ఎస్‌ఐలకు కెమెరాల నిర్వహణ, పనితీరుపై బాధ్యత అప్పగించాం. అవసరమైన చోట కాలనీ సమావేశాలు నిర్వహించి ప్రజలకు కూడా బాధ్యతను వివరించాలి. పోలీసులకు ప్రతి చోట కళ్లుండవు. కానీ సమర్థంగా పనిచేసే సీసీ కెమెరా వ్యవస్థ పోలీసింగ్‌కు అదనపు కళ్లలా పనిచేస్తుంది. అందుకే దీనిని మరింత బలోపేతం చేయాలన్నది నా ఉద్దేశం.

‘సంఘమిత్ర’లతో గ్రామస్థాయిలో గంజాయిపై నిఘా

గంజాయి నియంత్రణలో మహిళా సంఘాల భాగస్వామ్యం నాకు చాలా ముఖ్యమైన అంశం. ప్రతి గ్రామంలో మహిళా సంఘాలు అందుబాటులో ఉంటాయి. వారికి తమ ప్రాంతంలోని కుటుంబాలు, యువత, సామాజిక పరిస్థితులపై సహజంగానే అవగాహన ఉంటుంది. అందుకే వారిని కేవలం అవగాహన కార్యక్రమాలకు పరిమితం చేయకుండా ‘సంఘమిత్రలు’గా భాగస్వామ్యం చేస్తున్నాం. గంజాయి వినియోగం ఎక్కడ పెరుగుతోంది? ఎవరైనా యువతను మత్తు పదార్థాల వైపు తీసుకెళ్తున్నారా? వంటి విషయాలపై గ్రామస్థాయిలో అవగాహన పెంచాలి. తాజాగా జనగామలో మహిళా సంఘాలతో సమావేశం నిర్వహించి ఈ అంశాలపై వివరించాం. తల్లులుగా మత్తు పదార్థాల ప్రభావాన్ని వారు బాగా అర్థం చేసుకోగలరు. పోలీసులకు చేరని సమాచారం కూడా కొన్నిసార్లు సమాజంలోనే ఉంటుంది. అలాంటి సమాచారాన్ని బాధ్యతాయుతంగా పోలీసులకు చేరేలా వ్యవస్థను రూపొందించడమే మా ఉద్దేశం. ప్రజలను పోలీసింగ్‌లో భాగస్వాములను చేస్తేనే గంజాయిపై పోరాటం మరింత బలపడుతుంది.

సాంకేతికతే కొత్త ఆయుధం.. ఏఐపై దృష్టి

కాలం మారుతున్నకొద్దీ పోలీసింగ్‌ కూడా మారాలి. నేరస్తులు సాంకేతికతను ఉపయోగిస్తున్నప్పుడు పోలీసులు కూడా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి. పరిపాలన, పోలీసింగ్‌ను మరింత పటిష్టం చేసేందుకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వంటి సాంకేతికతను వినియోగించుకునేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర స్థాయిలో తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా ఏఐని సమర్థంగా ఉపయోగించుకుని ప్రజలకు మరింత విస్తృతమైన సేవలు అందించే అవకాశాలను పరిశీలిస్తాం. ఇప్పటికే వాట్సాప్‌ ద్వారా ఎఫ్‌ఐఆర్‌లు స్వీకరిస్తున్నాం. ప్రజలు పోలీస్‌స్టేషన్‌కు రావాల్సిన అవసరం లేకుండా అందుబాటులో ఉన్న సాంకేతిక మార్గాలను ఉపయోగించుకోవడం భవిష్యత్తులో మరింత పెరగాలి. అయితే టెక్నాలజీ ఎంత వచ్చినా మానవీయ కోణాన్ని మర్చిపోకూడదు. ప్రజల సమస్యను వినడం, వారికి భరోసా ఇవ్వడం పోలీసింగ్‌లో ఎప్పటికీ ముఖ్యమే. సాంకేతికత మన పనిని వేగవంతం చేయాలి.. ప్రజలతో మన అనుబంధాన్ని తగ్గించకూడదు.

వరంగల్‌ పోలీసింగ్‌ వేరు.. అర్బన్‌, రూరల్‌ బ్యాలెన్సే కీలకం

వరంగల్‌ ప్రాంతంలో నేను తొలిసారిగా పూర్తిస్థాయిలో విధులు నిర్వహిస్తున్నాను. గతంలో ఒకసారి వచ్చి 15 రోజులు డ్యూటీ చేశాను. వరంగల్‌కు చారిత్రక ప్రాధాన్యం ఉంది. హైదరాబాద్‌ తర్వాత రాష్ట్రంలో ప్రధాన నగరంగా ఎదిగిన ఈ ప్రాంతంలో అర్బన్‌, రూరల్‌ రెండు రకాల పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఇక్కడి పోలీసింగ్‌ కూడా ప్రత్యేకంగా ఉండాలి. హైదరాబాద్‌ పూర్తిగా అర్బన్‌ ప్రాంతం. అక్కడి సమస్యలు, ఇక్కడి సమస్యలు ఒకేలా ఉండవు. నగరంలో ట్రాఫిక్‌, సైబర్‌ క్రైం, పట్టణ నేరాలు ఒకవైపు ఉంటే.. గ్రామీణ ప్రాంతాల్లో భూ వివాదాలు, గంజాయి సరఫరా వంటి సమస్యలు మరోవైపు ఉంటాయి. ఈ రెండు ప్రాంతాల అవసరాలను బ్యాలెన్స్‌ చేస్తూ పనిచేయడమే నా ముందున్న ప్రధాన సవాలు. వరంగల్‌ పోలీసింగ్‌కు ఒక ప్రత్యేకమైన విధానాన్ని తీసుకురావాలన్నది నా ఆలోచన. సమస్య వచ్చినప్పుడు స్పందించడం మాత్రమే కాకుండా.. సమస్య ఎక్కడి నుంచి మొదలవుతుందో గుర్తించి ముందుగానే నియంత్రించే పోలీసింగ్‌ ఉండాలి.

ఫేమ్‌ కోసం కాదు.. ఫలితం కోసం

పోలీస్‌ అధికారిగా నాకు ఫేమ్‌ రావాలి.. పేరు రావాలి అనే ఉద్దేశం లేదు. నేను చేసే పని ప్రజలకు కనిపించాలి. ఒక ప్రాంతంలో నేరాలు తగ్గితే అదే నాకు ఫలితం. ఒక బాధితుడికి న్యాయం జరిగితే అదే నాకు సంతృప్తి. ఒక కుటుంబం భయపడకుండా బయటకు వెళ్లగలిగితే అదే మంచి పోలీసింగ్‌కు గుర్తింపు. నాకు చట్టంపై పూర్తి నమ్మకం ఉంది. చట్టాన్ని నమ్మి, దాని ప్రకారమే విధులు నిర్వర్తిస్తాను. అదే సమయంలో శిక్ష పడే వరకు వేచి చూసే ఓపిక కూడా ఉండాలి. ప్రతి కేసులోనూ వెంటనే ఫలితం రావాలని కాదు.. కానీ దర్యాప్తు సరైన దిశలో సాగాలి. పోలీసింగ్‌ ప్రభావవంతంగా ఉండటమే కాదు.. దాని ఫలితం ప్రజలకు అనుభూతి కావాలి. నేరస్తులకు చట్టం ఉందనే భయం, సాధారణ ప్రజలకు పోలీసులున్నారనే భరోసా కలిగించడమే పోలీసుల‌ పని తీరుకు అసలు కొలమానం. వరంగల్‌లో పోలీసింగ్‌ అంటే ప్రజలకు భరోసా.. నేరస్తులకు చట్టంపై భయం ఉండేలా చేయడమే నా లక్ష్యం’’ అని సీపీ శ్వేతారెడ్డి స్పష్టం చేశారు.

ఉత్త‌రం కాక‌తీయ ఎడిట‌ర్‌
కిర‌ణ్ గౌడ్ అరెల్లి
-7396604266

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.