కడియం సిగ్గుపడు..!
కేసీఆర్ దళితులకు ఏం చేయలేదా.?!
ఎన్టీఆర్ తర్వాత నీకు రాజకీయ బిక్ష పెట్టింది కేసీఆర్ కాదా?
గల్లీలో ఉన్న నిన్ను ఢిల్లీకి తీసుకెళ్లింది ఎవరు?
పార్టీలో గుర్తింపు, పదవి కల్పించింది కేసీఆర్ కాదా?
పదవుల కోసం రేవంత్‌రెడ్డిని వెనకేసుకొస్తున్నావా?
నిజంగా దళిత పక్షపాతివైతే స్పీకర్ పోడియం ముందు కూర్చో
ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ ఫైర్
కాకతీయ, హన్మకొండ : కేసీఆర్ దళితులకు ఏమీ చేయలేదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడటం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ మండిపడ్డారు. రాజకీయంగా కడియం శ్రీహరి ఎదుగుదలకు కేసీఆర్ చేసిన సహకారాన్ని మరిచిపోయి ఇప్పుడు ఆయనపైనే విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఎన్టీఆర్ అవకాశం ఇచ్చిన తర్వాత రాజకీయంగా పక్కకు వెళ్లిపోయిన కడియం శ్రీహరిని గల్లీ నుంచి ఢిల్లీకి తీసుకెళ్లింది కేసీఆర్ కాదా అని నిలదీశారు. పార్టీలో గుర్తింపు కల్పించి, రాజకీయంగా ఎదిగే అవకాశం ఇచ్చింది కూడా కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. బీఆర్ ఎస్ ప్రజాప్రతినిధులపై కేసులు నమోదు చేయడాన్ని నిరసిస్తూ సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ మంగళవారం హన్మకొండ అంబేద్కర్ సెంటర్లో బీఆర్ ఎస్ నేతలు నిరసన తెలిపారు. ఈసందర్భంగా మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మాట్లాడారు.కడియం శ్రీహరిని ఉద్దేశించి తీవ్రంగా విమర్శలు చేశారు.
గల్లీలో ఉన్న నిన్ను ఢిల్లీకి తీసుకెళ్లింది ఎవరు?
ఎన్టీఆర్ రాజకీయంగా అవకాశం ఇచ్చిన తర్వాత పక్కకు వెళ్లి మూలకు కూర్చున్న కడియం శ్రీహరికి తిరిగి రాజకీయ గుర్తింపు కల్పించింది కేసీఆర్ కాదా అని వినయ్‌భాస్కర్ ప్రశ్నించారు. గల్లీలో ఉన్న వ్యక్తిని ఢిల్లీకి తీసుకెళ్లింది కేసీఆర్ చేసిన తప్పిదమా అని నిలదీశారు. రాజకీయంగా బిక్ష పెట్టి, పార్టీలో పెద్ద స్థానం కల్పించింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. అలాంటి కేసీఆర్‌పైనే ఇప్పుడు దళితులపై ప్రేమ లేదని కడియం శ్రీహరి మాట్లాడటం ఎంతవరకు సమంజసమని అన్నారు. గతంలో తన రాజకీయ జీవితానికి అండగా నిలిచిన నాయకుడిని మరిచిపోయి, ఇప్పుడు ఆయనపైనే ఆరోపణలు చేయడం కృతజ్ఞతా రాహిత్యమని విమర్శించారు. డబ్బు, పదవుల ఆశతోనే రేవంత్‌రెడ్డిని కడియం శ్రీహరి వెనకేసుకొస్తున్నారని వినయ్‌భాస్కర్ విమర్శించారు. రాజకీయ పదవుల కోసం ఒకప్పుడు తనకు అండగా నిలిచిన కేసీఆర్‌ను విమర్శించడం సరికాదన్నారు. కడియం శ్రీహరి తన రాజకీయ జీవితంలో ఎవరి వల్ల ఎదిగారో ప్రజలకు తెలుసని పేర్కొన్నారు. తన కులాన్నే అవమానించేలా రేవంత్‌రెడ్డి మాట్లాడిన సందర్భాల రికార్డులు ఉన్నాయని, వాటిని తమ మీడియా ద్వారా ప్రజల ముందుకు తీసుకొస్తామని వినయ్‌భాస్కర్ అన్నారు. రేవంత్‌రెడ్డి గురించి కడియం గతంలో మాట్లాడిన వ్యాఖ్యలను మరోసారి చూసుకోవాలని సూచించారు. ఆ రికార్డులు చూసిన తర్వాతైనా వాస్తవాలు గుర్తు చేసుకోవాలని అన్నారు.
నిజంగా దళిత పక్షపాతివైతే స్పీకర్ పోడియం ముందు కూర్చో
కడియం శ్రీహరికి దళితులపై నిజంగా ప్రేమ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో దళితులకు జరుగుతున్న అవమానాలపై మాట్లాడాలని వినయ్‌భాస్కర్ డిమాండ్ చేశారు. పార్టీ గురించి, ఇతర నాయకుల గురించి మాట్లాడటం కంటే దళితుల సమస్యలపై నిలబడాలని సూచించారు. నిజంగా దళిత పక్షపాతి అయితే స్పీకర్ పోడియం ముందు కూర్చొని దళితుల తరఫున తన నిరసన వ్యక్తం చేయాలని సవాల్ చేశారు. తనకు రాజకీయంగా పదవి రావడానికి దోహదపడిన దళితుల పక్షాన నిలబడాలని, దళితుల సమస్యలపై పోరాడాలని అన్నారు. మాకందరికీ గౌరవం ఉండాలి.. రాజ్యాంగానికి గౌరవం ఉండాలి.. ప్రజాస్వామ్యానికి గౌరవం ఉండాలి అని పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవులకు, సభా సంప్రదాయాలకు కూడా గౌరవం ఉండాలని స్పష్టం చేశారు.
దళితుల కోసం కేసీఆర్ ఎన్నో పథకాలు
కేసీఆర్‌కు దళితులపై ప్రేమ లేదని చెప్పడం వాస్తవాలను వక్రీకరించడమేనని వినయ్‌భాస్కర్ అన్నారు. దళితులను ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం దళిత బంధు వంటి కార్యక్రమాలను తీసుకొచ్చిందని పేర్కొన్నారు. దళితులు, బీసీల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ దళితులు, బీసీల అభ్యున్నతికి అనేక కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు. అలాంటి నాయకుడిపైనే దళితులపై ప్రేమ లేదని కడియం శ్రీహరి మాట్లాడటం సిగ్గుచేటని వినయ్‌భాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం చరిత్రను మరిచిపోయి మాట్లాడటం తగదని హితవు పలికారు.

