అంతా ఈశ్వర మాయ!
లాగిన్ నుంచి రహదారి తనిఖీల దాకా అక్రమాలు
విధుల్లో లేని రోజున డిజిటల్ సంతకాలు
భారీ వాహనాలకు నెలవారీ ‘మామూలు’
ఉన్నతాధికారుల మౌనం వెనుక మతలబేంటి?
సమగ్ర విచారణకు ప్రజల డిమాండ్
కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా రవాణాశాఖ కార్యాలయం వ్యవహారశైలి ములుగు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. వాహనాల రిజిస్ట్రేషన్ (ఆర్సీ), డ్రైవింగ్ లైసెన్సులు, పర్మిట్లు, ఫిట్నెస్ తదితర ధ్రువపత్రాల జారీ ప్రక్రియలో డిజిటల్ లాగిన్లు, డిజిటల్ సంతకాల వినియోగంపై ఇప్పటికే పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తాజాగా రహదారి తనిఖీలు, భారీ వాహనాల వ్యవహారం, కార్యాలయంలో వ్యక్తుల పాత్రపై కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రవాణాశాఖలో అధికారికంగా సెలవు పొందకుండా, లేదా తన బాధ్యతలను సంబంధిత ఇన్చార్జి అధికారికి అప్పగించకుండా ఒక అధికారి కార్యాలయ విధులకు దూరంగా ఉన్న సమయంలో ఆయన లాగిన్ ద్వారా అధికారిక ధ్రువపత్రాలు జారీ అయితే.. ఆ ప్రక్రియపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉందని నిపుణులు, వాహనదారులు అంటున్నారు. డిజిటల్ విధానంలో ధ్రువపత్రాల జారీ జరుగుతున్నందున సంబంధిత అధికారి లాగిన్, డిజిటల్ సంతకం ఎప్పుడు, ఎక్కడ, ఎవరి ద్వారా వినియోగించబడిందనే వివరాలు సాంకేతికంగా పరిశీలించే అవకాశం ఉంది. ములుగు జిల్లా డిటిఓ ఈశ్వర్ సింగ్ ఠాకూర్ మరో జిల్లాలో కోర్టు హాజరుకు వెళ్లిన సమయంలో ములుగు కార్యాలయంలో ఆయన లాగిన్‌తో ధ్రువపత్రాలు జారీ అయ్యాయనే ఆరోపణలు నిజమైతే ఆ సమయంలో లాగిన్‌ను ఎవరు వినియోగించారు? డిజిటల్ సంతకం ఎలా ఉపయోగించబడింది? అధికారికి దీనిపై సమాచారం ఉందా? అన్న ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది.


‘లాగిన్’ వ్యవహారంపై ఉన్నతాధికారుల మౌనం ఎందుకు….?
రవాణా శాఖలో అధికారిపై ఆరోపణలు వెలువడినప్పుడు సంబంధిత శాఖ ఉన్నతాధికారులు ప్రాథమికంగా వాస్తవాలను పరిశీలించాల్సిన అవసరం ఉంది. లాగిన్ వివరాలు, డిజిటల్ సిగ్నేచర్ వినియోగానికి సంబంధించిన ఎలక్ట్రానిక్ రికార్డులు, ధ్రువపత్రాల జారీ సమయాలు, అధికారి హాజరు రికార్డులను సరిపోల్చి చూస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు స్పష్టమైన విచారణ లేదా అధికారిక వివరణ లేకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తప్పు జరిగిందా? లేదా అన్నది తేల్చేందుకు స్వతంత్ర విచారణ ఎందుకు జరపడం లేదన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. మరోవైపు ములుగు జిల్లా పరిధిలో ఇసుక, కంకర తదితర సరుకులను తరలించే భారీ, అతి భారీ వాహనాల విషయంలో కూడా తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిత్యం జిల్లా నుండి వెళ్లే ఇసుక లారీలు ప్రతి నెలా సుమారు రూ.7,500 వరకు ‘మామూలు’ చెల్లిస్తే తనిఖీల సమయంలో ఇబ్బందులు ఉండవని, చెల్లించని వాహనాలపై మాత్రం వివిధ నిబంధనల కింద కేసులు నమోదు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలు నిజమైతే రహదారులపై నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న వాహనాలను గుర్తించి ప్రభుత్వానికి జరిమానాల రూపంలో ఆదాయం సమకూర్చాల్సిన వ్యవస్థలోనే అక్రమ వసూళ్లకు తావిచ్చినట్లవుతుంది. తనిఖీల సమయంలోను అదనపు వసూళ్లకు పాల్పడుతున్న రవాణా శాఖ అధికారిపై కూడా విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటే బాగుంటుందని జిల్లా వాసులు అభిప్రాయపడుతున్నారు.
డిజిటల్ పేమెంట్లను నగదుగా మారుస్తున్నారా.?
తనిఖీల సందర్భంగా లేదా నెలవారీగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఎదురవుతున్న మొత్తాలు డిజిటల్ పేమెంట్ల ద్వారా స్వీకరించినప్పటికీ వాటిని నగదుగా మార్చి సంబంధిత అధికారులకు చేరవేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. వాహనాల తనిఖీల సందర్భంగా వాహనదారుల నుండి అప్పటికప్పుడు అధికారుల బంధు,మిత్రులకు డిజిటల్ రూపంలో వసూళ్లకు పాల్పడుతూ తర్వాత ఆ మొత్తాన్ని నగదు రూపంలోకి మార్చి సంబంధిత అధికారికి మొట్ట చెబుతున్నట్టు వాహనదారులు అభిప్రాయపడుతున్నారు. ములుగు జిల్లా రవాణాశాఖపై వరుసగా వస్తున్న ఆరోపణల నేపథ్యంలో జిల్లా కలెక్టర్, రవాణాశాఖ ఉన్నతాధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. అధికారి విధుల్లో లేని సమయంలో ధ్రువపత్రాలు జారీ అయ్యాయా?సంబంధిత డీటీఓ లాగిన్‌ను ఎవరు వినియోగించారు? డిజిటల్ సంతకం ఎక్కడి నుంచి వినియోగించబడింది? భారీ వాహనాలపై నెలవారీ వసూళ్లు జరుగుతున్నాయా? తనిఖీల్లో అక్రమ వసూళ్లు జరిగాయా? అనే అంశాలపై సమగ్ర, నిష్పక్షపాత విచారణ జరిపితే అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ప్రజలు అంటున్నారు.
నిజమైతే కఠిన చర్యలు తప్పవా…?
ఆరోపణలు విచారణలో నిజమని తేలితే సంబంధిత అధికారులపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలతో పాటు, అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు అని, రవాణాశాఖలో డిజిటల్ వ్యవస్థను పారదర్శకంగా నిర్వహించాల్సిన బాధ్యత ఉన్నతాధికారులపై ఉంది అని, ప్రజల అనుమానాలను నివృత్తి చేయాలంటే విచారణే ఏకైక మార్గం అని, ములుగు రవాణాశాఖపై వస్తున్న ఆరోపణలపై ఉన్నతాధికారులు ఇకనైనా స్పందిస్తారా? లేక ‘అంతా ఈశ్వర మాయ’ అంటూ మౌనం వహిస్తారా? అన్నది వేచి చూడాలి.

