జీవో 97ను వెంటనే రద్దు చేయాలి
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి
విద్యార్థులపై కళాశాలల ఒత్తిడి సరికాదు
మాజీ ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్ భాస్కర్ డిమాండ్
కాకతీయ, హనుమకొండ: పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని మాజీ ప్రభుత్వ చీఫ్‌విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ డిమాండ్ చేశారు. ఏకశిలా పార్కు వద్ద డెమొక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరాహార దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. పేద, మధ్యతరగతి విద్యార్థులు స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆధారపడి ఉన్నారని, నిధులు సకాలంలో విడుదల కాక విద్యార్థులు, తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. బకాయిలతో కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి పెంచుతున్నాయని తెలిపారు. జీవో 97తో పాలిటెక్నిక్ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, దాన్ని తక్షణమే రద్దు చేయాలని కోరారు. విద్యార్థుల హక్కుల కోసం చేపట్టే ప్రజాస్వామ్య పోరాటాలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జోరిక రమేష్, విద్యార్థి నాయకుడు వీరస్వామి, బీసీ నాయకుడు తాడిచెట్టు క్రాంతి, వివిధ విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.

