కార్యాలయాలకే పరిమితం కావొద్దు
ప్రజల్లోకి వెళ్లి సమస్యలను పరిష్కరించాలి
గడువులోగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి
పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ఆదేశం
కాకతీయ, రాయపర్తి/పాలకుర్తి: అధికారులు కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ఆదేశించారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాయపర్తి మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు, సర్పంచులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. తాగునీరు, విద్యుత్, రోడ్లు, డ్రైనేజీలు, పారిశుద్ధ్యం, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రులు, వ్యవసాయం, సాగునీరు, పింఛన్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సమీక్షించారు. పెండింగ్ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని, సంక్షేమ పథకాలు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా అర్హులకు అందేలా చూడాలని అన్నారు. మండల సమగ్ర అభివృద్ధికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పెరికేడు గ్రామానికి చెందిన రైతు బాషబోయిన కుమార్ అగ్నిప్రమాదంలో పంట, వ్యవసాయ పనిముట్లు కోల్పోయిన నేపథ్యంలో మంజూరైన రూ.2,00,000 సీఎంఆర్ఎఫ్ చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. ఆపదలో ఉన్న ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

