గిరిజన రిజర్వేషన్ల పెంపు కేసీఆర్ ఘనతే
గిరిజనుల అభివృద్ధికి బీఆర్‌ఎస్ పెద్దపీట
కాంగ్రెస్ హామీలపై స్పష్టత ఇవ్వాలి
బీఆర్‌ఎస్ ములుగు నియోజకవర్గ ఇన్‌చార్జి బడే నాగజ్యోతి
కాకతీయ, ములుగు ప్రతినిధి : గిరిజన రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని బీఆర్‌ఎస్ ములుగు నియోజకవర్గ ఇన్‌చార్జి బడే నాగజ్యోతి అన్నారు. మంగళవారం ములుగు జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో గిరిజన సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. గిరిజనుల కోసం ప్రత్యేక అభివృద్ధి నిధికి చట్టబద్ధత కల్పించి, 2022–23లో రూ.13,412.63 కోట్లు, 2023–24లో రూ.15,232.62 కోట్లు కేటాయించామని తెలిపారు. ‘గిరి వికాసం’ ద్వారా 19,698 మంది రైతులకు చెందిన 56,613 ఎకరాలను సాగులోకి తీసుకొచ్చామన్నారు. ములుగు నియోజకవర్గంలో 7,700కు పైగా పోడు పట్టాలు, ఎటూరునాగారం ఐటీడీఏ పరిధిలో 3,500కు పైగా బోర్లు మంజూరు చేశామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఎస్టీ డిక్లరేషన్ హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 17న గిరిజన ఆవాసాల్లో ర్యాలీలు నిర్వహించి కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేయాలని పిలుపునిచ్చారు.

