నామినేటెడ్ రేసులో మొలుగూరి యాకయ్యగౌడ్?
పీసీసీ అధ్యక్షుడితో వరుస భేటీలు
పార్టీ బలోపేతానికి ఏళ్లుగా కృషి
బీసీ వర్గాల సమీకరణలో కీలక పాత్ర
తెలంగాణ తల్లి విగ్రహం సొంత ఖర్చులతో ఏర్పాటు
భారత్ జోడో యాత్ర నుంచి స్థానిక ఎన్నికల వరకు చురుకైన సేవలు
సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజల్లో గుర్తింపు
కాకతీయ, జనగామ : కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల భర్తీకి కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన మొలుగూరి యాకయ్యగౌడ్ పేరు ఆశావహుల జాబితాలో వినిపిస్తోంది. పార్టీ కోసం ఏళ్లుగా పనిచేయడంతోపాటు బీసీ వర్గాల సమీకరణ, కార్మికుల సమస్యలు, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించిన ఆయనకు పదవి దక్కుతుందనే ఆశలు అనుచరుల్లో నెలకొన్నాయి. ఈ క్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ను యాకయ్యగౌడ్ 4, 5 సార్లు కలసి తన సేవలను వివరించినట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. మొలుగూరి యాకయ్యగౌడ్ గౌడ కుల సంఘాల రాష్ట్ర నాయకుడిగా 10 ఏళ్లపాటు పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఆయన.. అనంతరం పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ కార్యకర్తలను సమీకరించారు. పార్టీ కష్టకాలంలోనూ కాంగ్రెస్ కార్యక్రమాలకు దూరం కాకుండా పనిచేశారని అనుచరులు చెబుతున్నారు. రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో యాకయ్యగౌడ్ చురుకుగా పాల్గొన్నారు. కార్మిక వర్గానికి మద్దతుగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ ప్రజాస్వామ్య కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొని వారి సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లారు.
తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు
పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని యాకయ్యగౌడ్ సొంత ఖర్చులతో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సీరెడ్డి, ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి ప్రోత్సాహం అందించారు. విగ్రహ ప్రతిష్ఠాపన ద్వారా పార్టీ కార్యక్రమాల్లో తన చురుకైన పాత్రను మరోసారి చాటుకున్నారు. గతంలో బీఆర్ఎస్ నాయకుల భౌతిక దాడిని ఎదుర్కొన్నప్పటికీ పార్టీ కోసం పనిచేయడం కొనసాగించారని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి యశస్వినీరెడ్డి విజయానికి బీసీ ఓటర్లను సమీకరించడంలో కీలకంగా పనిచేశారని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.
స్థానిక ఎన్నికల్లోనూ చురుకైన పాత్ర
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పలు గ్రామాల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి యాకయ్యగౌడ్ కృషి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో కార్యకర్తలను సమన్వయం చేసి కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు కూడగట్టారు. పాలకుర్తి నియోజకవర్గంలోని చెన్నూరు గ్రామానికి చెందిన ఆయనకు స్థానికంగా బీసీ వర్గాలతో మంచి పరిచయాలు ఉన్నాయని అనుచరులు చెబుతున్నారు. యాకయ్యగౌడ్ నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గత 3 విద్యా సంవత్సరాల్లో పేద విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు గొడుగులు అందించారు. విద్యార్థులు, కార్మికులు, పేద కుటుంబాలకు సహాయం చేస్తూ సామాజిక సేవలోనూ ముందున్నారు. నామినేటెడ్ పదవి దక్కితే పాలకుర్తిలో పార్టీ బలోపేతంతోపాటు బీసీ వర్గాల సమీకరణకు ఆయన సేవలను వినియోగించుకోవచ్చని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, పలువురు ఎమ్మెల్యేలు, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య యాకయ్యగౌడ్ సేవలను పార్టీకి ఉపయోగించుకోవాలని సూచిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఏళ్లుగా పనిచేస్తున్న కార్యకర్తలకు అవకాశం కల్పిస్తే కొత్త నాయకత్వం ఎదుగుతుందని నియోజకవర్గ నాయకులు చెబుతున్నారు.

