మొక్కల పేరిట వందల కోట్లు ఆవిరి
ఏటా నాటుతున్నా కనిపించని పచ్చదనం
ఐదేళ్ల లెక్కలపై విచారణకు ప్రజల డిమాండ్
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : మొక్కలు నాటే పేరుతో వందల కోట్లు ఖర్చు చేస్తున్నా పచ్చదనం కనిపించడం లేదని, నిధుల వినియోగంపై లెక్కలు వెల్లడించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వరంగల్ బల్దియాలో హార్టికల్చర్ విభాగం తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకే ప్రాంతంలో ఏటా మొక్కలు నాటడం, అవి ఎండిపోవడంతో మళ్లీ నాటడం పరిపాటిగా మారిందని ఆరోపణలు ఉన్నాయి. మొక్కలు 85% నుంచి 95% వరకు బతికినట్లు రికార్డుల్లో చూపుతున్నా క్షేత్రస్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయని ప్రజలు అంటున్నారు. గత ఐదేళ్లలో ఎన్ని మొక్కలు నాటారు, ఎంత ఖర్చు చేశారనే వివరాలు వెల్లడించాలని కోరుతున్నారు. మొక్కల సంరక్షణపై నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలపై జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

