మద్యం మత్తులో తమ్ముడి దారుణ హత్య
అన్న చేతిలో తమ్ముడు బలి.. కత్తితో దాడి
కాకతీయ, గీసుగొండ: మద్యం మత్తు అన్న దమ్ముల మధ్య ఘర్షణకు దారితీసి చివరకు తమ్ముడి ప్రాణాలను బలిగొంది. గీసుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని 16వ డివిజన్ కీర్తినగర్ హౌసింగ్ బోర్డు కాలనీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సీఐ విశ్వేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ మహానగరపాలక సంస్థ 16వ డివిజన్ కీర్తి నగర్ హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన ఎలుబాక రాజయ్య కుమారులు ఎలుబాక ప్రవీణ్ (30),ఎలుబాక ప్రసాద్ (25) అన్నదమ్ములు.19వ తారీకు శనివారం రాత్రి ఇద్దరూ మద్యం మత్తులో ఉండగా వారి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ప్రవీణ్ గదిలో నిద్రిస్తున్న తన తమ్ముడు ప్రసాద్‌పై కత్తితో దాడి చేయగా తీవ్ర గాయాలతో ప్రసాద్ మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. పరారీ లో ఉన్న నిందితుడు ప్రవీణ్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

