కోల్డ్ ‘చోరేజీలు’!
ఏనుమాములలో జీరో చీకటి వ్యాపారం
ప్రభుత్వ నిఘా ఉన్నా ఆగని దందా!
తెర వెనుక జరుగుతున్న తతంగం ఏంటి?
మార్కెట్ ప్రమేయం లేకుండానే మిర్చి తరలింపు?
పట్టీలు.. వే బ్రిడ్జి స్లిప్పుల మధ్య పొంతన ఉందా?
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద మార్కెట్‌గా పేరొందిన ఏనుమాముల మార్కెట్ పరిధిలోని కోల్డ్ స్టోరేజీల చుట్టూ అనుమానాలు ముసురుకుంటున్నాయి. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన మిర్చిని భద్రపరచాల్సిన కోల్డ్ స్టోరేజీలు.. అక్రమ లావాదేవీలకు అడ్డాలుగా మారుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మార్కెట్ యార్డు ప్రమేయం లేకుండా మిర్చి బస్తాలను బయటకు తరలిస్తూ ‘జీరో’ వ్యాపారం సాగిస్తున్నారన్న ఆరోపణలు బలపడుతుండటంతో.. ప్రభుత్వ నిఘా ఉన్నా దందా ఎలా సాగుతోందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇటీవల ఖమ్మం మార్కెట్ యార్డులో ధరల్లో వ్యత్యాసం(ఆర్డీ) వ్యవహారంలో వ్యాపారులు మార్కెట్ కమిటీపై ఒత్తిడి తీసుకొచ్చి లావాదేవీలు నిలిపివేస్తామని హెచ్చరించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కోల్డ్ స్టోరేజీల్లో జరుగుతున్న జీరో దందా, ఆర్డీ ఎగవేతను అరికట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా 6 ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా గత నెల 14న కరీంనగర్ నుంచి వచ్చిన మార్కెట్ సెక్రటరీలు, వ్యవసాయ అధికారులతో కూడిన ప్రత్యేక బృందం ఏనుమాముల మార్కెట్ పరిధిలోని కోల్డ్ స్టోరేజీల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. మిర్చి బస్తాల లావాదేవీలు, స్టాక్ రిజిస్టర్లు, పట్టీలను పరిశీలించింది. తనిఖీలు జరుగుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో జీరో దందా కొనసాగుతోందన్న ఆరోపణలు మాత్రం వినిపిస్తున్నాయి.
తెర వెనుక జరుగుతున్న తతంగం ఏంటి?
కొందరు ఖరీదుదారులు, కమీషన్ ఏజెంట్లు కుమ్మక్కై వందలాది మిర్చి బస్తాలను మార్కెట్ యార్డు ప్రమేయం లేకుండానే కోల్డ్ స్టోరేజీల నుంచి నేరుగా బయటకు తరలిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మార్కెట్‌లో తూకం వేయకుండా ప్రైవేటు వే బ్రిడ్జిల వద్ద తూకం వేసి లావాదేవీలు నిర్వహిస్తున్నారన్న ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. ఇలాంటి లావాదేవీలు వాస్తవమైతే ప్రభుత్వానికి రావాల్సిన మార్కెట్ ఫీజుకు భారీగా గండిపడే అవకాశం ఉంది. మిర్చి బస్తాల కొనుగోలు, తరలింపు వివరాలు మార్కెట్ రికార్డుల్లో నమోదవుతున్నాయా? లేదా అనే అంశం ఇప్పుడు కీలకంగా మారింది. ఈ వ్యవహారంపై రైతులు, దాడువాయిలు మార్కెట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన కనిపించడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
పట్టీలు.. స్లిప్పులు సరిపోతున్నాయా?
కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉన్న మొత్తం మిర్చి బస్తాల లెక్క తేల్చడంతోపాటు.. ఏ వ్యాపారి ఎన్ని బస్తాలు కొనుగోలు చేశాడు? ఎన్ని బస్తాలు బయటకు తరలించాడు? కొనుగోలు చేసిన బస్తాలకు సంబంధించిన పట్టీలను మార్కెట్‌కు సక్రమంగా సమర్పించారా? ప్రైవేటు వే బ్రిడ్జి స్లిప్పుల్లో నమోదైన బరువుకు మార్కెట్ పట్టీల్లోని వివరాలకు పొంతన ఉందా? అనే అంశాలపై లోతుగా విచారణ జరపాలని రైతులు కోరుతున్నారు. స్టాక్ రిజిస్టర్లు, మార్కెట్ పట్టీలు, వే బ్రిడ్జి స్లిప్పులు, వ్యాపారుల కొనుగోలు వివరాలను పరస్పరం సరిపోల్చితే అక్రమ లావాదేవీలకు సంబంధించి వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఏం చేస్తే బండారం బయటపడుతుంది?
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక తనిఖీ బృందాలు కేవలం రిజిస్టర్ల పరిశీలనకే పరిమితం కాకుండా.. కోల్డ్ స్టోరేజీల్లోకి వచ్చిన, బయటకు వెళ్లిన ప్రతి మిర్చి బస్తా లావాదేవీని క్షుణ్ణంగా పరిశీలించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మార్కెట్ రికార్డులు, వ్యాపారుల పట్టీలు, వే బ్రిడ్జి స్లిప్పులను క్రాస్‌చెక్ చేయాలని కోరుతున్నారు. కోల్డ్ స్టోరేజీల్లో నిజంగా జీరో దందా జరుగుతోందా? మార్కెట్ ఫీజుకు గండి పడుతోందా? అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారా? అన్న ప్రశ్నలకు సమాధానం రావాలంటే సమగ్ర తనిఖీతోపాటు లోతైన విచారణ అవసరమని రైతులు చెబుతున్నారు. మార్కెట్ ఆదాయానికి నష్టం కలిగించే అక్రమ లావాదేవీలు రుజువైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

