17వ వసంతంలోకి యంగ్ స్టార్స్ యూత్!
సేవా స్ఫూర్తితో 17 ఏళ్ల ప్రస్థానం
2009లో మొదలై.. గ్రామ యువతకు ఐక్యతా వేదికగా
పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకుడితో నవరాత్రులు
వావిలాల గణేష్ లడ్డూకు ప్రత్యేక గుర్తింపు
స్థాపకుల బాటలో కొత్త నాయకత్వం.. సేవా కార్యక్రమాలే లక్ష్యంగా ముందుకు
కాకతీయ, మహబూబాబాద్ : ఒక చిన్న ఆలోచనగా మొదలైన యంగ్ స్టార్స్ యూత్.. 17వ వసంతంలోకి అడుగుపెట్టి గ్రామ యువతకు ఐక్యత, సేవా స్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తోంది. 2009లో బైరి రంజిత్‌కుమార్, మద్దెల రాజేష్ ఆలోచనతో ప్రారంభమైన యూత్ అసోసియేషన్.. కొద్దిమంది యువకులతో మొదలై నేడు గ్రామంలోని పలువురు యువతను ఒక్కతాటిపైకి తీసుకొచ్చే స్థాయికి ఎదిగింది. యువత అంటే వినోదానికే పరిమితం కాదని.. గ్రామానికి అవసరమైన సమయంలో ముందుండి సేవ చేయవచ్చని యంగ్ స్టార్స్ యూత్ తమ కార్యక్రమాలతో చాటుతోంది.
వినాయక నవరాత్రుల సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ వావిలాలలో మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. పర్యావరణహిత విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతోపాటు భక్తి, సామాజిక బాధ్యతను కలగలిపి ఉత్సవాలను నిర్వహించడం యూత్ ప్రత్యేకతగా నిలుస్తోంది. హైదరాబాద్‌లో ఖైరతాబాద్ గణేష్‌కు ఎంతటి గుర్తింపు ఉందో.. వావిలాలలో యంగ్ స్టార్స్ యూత్ గణేష్ లడ్డూకు అంతే ప్రత్యేకత ఉందని గ్రామస్థులు చెబుతున్నారు.

లడ్డూకు భారీ డిమాండ్
యంగ్ స్టార్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే గణేష్ లడ్డూను వేలం పాటలో దక్కించుకునేందుకు ప్రతి ఏటా భక్తులు ఆసక్తి చూపుతున్నారు. లడ్డూను దక్కించుకున్న వారికి అంతా మంచే జరుగుతుందన్న విశ్వాసంతో వేలం పాటలో పోటీ పడుతున్నారు. దీంతో వినాయక నవరాత్రుల్లో వావిలాల లడ్డూ వేలం ప్రత్యేక ఆకర్షణగా మారింది.
యంగ్ స్టార్స్ యూత్‌కు బలమైన పునాదులు వేసిన బైరి రంజిత్‌కుమార్, మద్దెల రాజేష్ 15 ఏళ్లపాటు యువతను సమన్వయం చేస్తూ సంస్థను ముందుకు నడిపించారు. వారు పెంపొందించిన ఐక్యత, సోదరభావం, సేవా స్ఫూర్తి నేటికీ కొనసాగుతోంది. ప్రస్తుతం అధ్యక్షుడు నాళ్లం రఘుపతి, ఉపాధ్యక్షుడు మారగాని అశోక్ ఆధ్వర్యంలో యువత సేవా ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది.

పండుగలకే పరిమితం కాకుండా..
యంగ్ స్టార్స్ యూత్ కార్యక్రమాలు కేవలం పండుగల నిర్వహణకే పరిమితం కావడం లేదు. గ్రామంలో సామాజిక సేవ, పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణ, ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాల్లో యువత భాగస్వామ్యమవుతోంది. గ్రామ అవసరాలను గుర్తించి అందుబాటులో ఉన్నంత మేరకు సేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ‘ఒక్కరి కోసం అందరం.. అందరి కోసం ఒక్కరం’ అనే స్ఫూర్తితో యంగ్ స్టార్స్ యూత్ 17వ వసంతంలోకి అడుగుపెట్టింది. స్థాపకులు వేసిన సేవా పునాదులను కొనసాగిస్తూ.. కొత్త నాయకత్వంలో మరిన్ని సామాజిక కార్యక్రమాలు చేపట్టేందుకు యువత సిద్ధమవుతోంది. గ్రామ యువతను ఒక్కతాటిపైకి తీసుకొచ్చే వేదికగా 17 ఏళ్లుగా కొనసాగుతున్న యంగ్ స్టార్స్ యూత్ ప్రస్థానం.. వావిలాల గ్రామంలో యువత ఐక్యతకు ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తోంది.

