బంగారు వ్యాపారులకు డిజిటల్ అరెస్ట్ బెదిరింపులు
రూ. 4.20 లక్షల వరకు అక్రమ వసూళ్లు
పోలీస్ యూనిఫాం, మొబైల్ ఫోన్ స్వాధీనం
మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్
కాకతీయ, మహబూబాబాద్ : పోలీసులుగా నటిస్తూ బంగారు వ్యాపారులను ఫోన్లో బెదిరించి ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు సైబర్ నేరగాళ్లను కేసముద్రం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి పోలీస్ యూనిఫాం, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ తెలిపారు. నిడమనూరుకు చెందిన షేక్ ఇర్ఫాన్ (29), చింతలచేరువు ప్రశాంత్ (26) నిందితులుగా గుర్తించారు. ఇర్ఫాన్ పోలీస్ యూనిఫాం ధరించి ఫొటో తీసుకుని వాట్సాప్, ట్రూకాలర్‌లో డీపీగా పెట్టుకున్నాడు. కేసముద్రం మండలానికి చెందిన బంగారు వ్యాపారి బోగోజు వేణుగోపాలచారికి ఫోన్ చేసి తాను వికారాబాద్ సమీపంలోని పార్వతీపురం పోలీస్‌స్టేషన్ ఎస్ఐనంటూ పరిచయం చేసుకున్నాడు. ఇద్దరు దొంగలను పట్టుకున్నామని, వారు దొంగిలించిన బంగారాన్ని వ్యాపారి కొనుగోలు చేశాడంటూ బెదిరించి వాట్సాప్‌లో క్యూఆర్ కోడ్ పంపి రూ. 88,026 వసూలు చేశాడు. సాంకేతిక ఆధారాలు, సైబర్ క్రైమ్ పోర్టల్ వివరాలు, బ్యాంక్ స్టేట్మెంట్ల ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు 20-09-2026న అరెస్ట్ చేశారు. 15-08-2026 నుంచి 15-09-2026 వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో బంగారు వ్యాపారుల నుంచి సుమారు రూ. 4,20,000 వసూలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. గతంలోనూ వీరిపై పలు పోలీస్స్టేషన్లలో కేసులు నమోదైనట్లు ఎస్పీ తెలిపారు. పోలీసుల పేరుతో వచ్చే అనుమానాస్పద కాల్స్, క్యూఆర్ కోడ్లకు స్పందించవద్దని, సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు. విలేకరుల సమావేశంలో డీఎస్పీ తిరుపతిరావు పాల్గొన్నారు.

