సంక్షేమం..వృద్ధికి పెట్టుబడే
విద్యార్థుల పౌష్టికాహారమే రాష్ట్ర భవిష్యత్తుకు పెట్టుబడి
రాష్ట్రంలో 27 లక్షల మంది విద్యార్థులకు అల్పాహారం
ప్రపంచంలో ఎక్కడా లేని కార్యక్రమం తెలంగాణలోనే
బీఆర్‌ఎస్‌కు గతమే తప్ప భవిష్యత్తు లేదు
నవంబర్ 19న ఇందిరమ్మ కుటుంబ బీమా
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
మునగాలలో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌కు శంకుస్థాపన
కాకతీయ, కోదాడ : రాష్ట్రంలోని 27 లక్షల మంది విద్యార్థులకు ప్రతిరోజూ వేడివేడి అల్పాహారం అందించే కార్యక్రమం ప్రపంచంలో మరెక్కడా లేదని, తెలంగాణలోనే తొలిసారిగా ఇలాంటి వినూత్న కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. విద్యార్థులకు అందిస్తున్న పౌష్టికాహారం ఉచితం కాదని, రాష్ట్ర భవిష్యత్తు మానవ వనరులపై ప్రభుత్వం చేస్తున్న పెట్టుబడిగా చూడాలని పేర్కొన్నారు. పిల్లలు ఆరోగ్యంగా ఉండి బాగా చదువుకుంటే భవిష్యత్తులో రాష్ట్ర ఉత్పత్తికి పెద్దఎత్తున తోడ్పడతారని, తద్వారా జీఎస్‌డీపీ వృద్ధికి దోహదపడతారని తెలిపారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం మునగాలలో రూ.9.6 కోట్లతో నిర్మించనున్న సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌కు భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. 1,020 పాఠశాలల్లోని దాదాపు 60 వేల మంది విద్యార్థులకు ఒకే కిచెన్ నుంచి పరిశుభ్రమైన, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వేడివేడి అల్పాహారం అందించేందుకు గ్రీన్‌ఫీల్డ్ కిచెన్‌ను నిర్మిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లోని 27 లక్షల మంది విద్యార్థులకు వారానికి ఆరు రోజులపాటు అల్పాహారం అందిస్తున్నామని, మూడు రోజులు పాలు, మూడు రోజులు రాగిజావ ఇస్తున్నామని చెప్పారు.

సంక్షేమం.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పెట్టుబడి
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఉచితాలుగా చూడొద్దని, పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులపై చేస్తున్న ఖర్చు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు తిరిగి ప్రయోజనం చేకూర్చే పెట్టుబడని భట్టి విక్రమార్క అన్నారు. రైతు భరోసా, ఉచిత విద్యుత్, సన్నబియ్యం, రాజీవ్ ఆరోగ్యశ్రీ, మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, వడ్డీలేని రుణాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఇందిరమ్మ ఇళ్ల వంటి కార్యక్రమాల ద్వారా పేద కుటుంబాలు ఆర్థికంగా ఎదగడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజల కొనుగోలు శక్తి పెరిగితే ఆర్థిక కార్యకలాపాలు పెరిగి జీఎస్‌డీపీ వృద్ధికి దోహదం చేస్తుందని చెప్పారు. బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తామని చేస్తున్న ప్రకటనలపై భట్టి విక్రమార్క స్పందిస్తూ.. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు అవసరమైన సంక్షేమ కార్యక్రమాలను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ఇప్పుడు మళ్లీ వస్తామని చెబుతున్నారని, అసలు ఏం చేయడానికి వస్తున్నారో ప్రజలకు చెప్పాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లను ఆపడానికి వస్తారా? సన్నబియ్యం పంపిణీ నిలిపివేయడానికి వస్తారా? 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఆపడానికి వస్తారా? మహిళల వడ్డీలేని రుణాలు నిలిపివేయడానికి వస్తారా? పేద విద్యార్థులకు అందుతున్న ఆర్థిక సాయాన్ని ఆపడానికి వస్తారా? అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌కు గతమే తప్ప భవిష్యత్తు లేదని వ్యాఖ్యానించారు.
నవంబర్ 19న కుటుంబ బీమా
ప్రతి కుటుంబానికి భద్రత కల్పించే లక్ష్యంతో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని నవంబర్ 19న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ప్రారంభించనున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. కుటుంబ యజమానికి అనుకోని ప్రమాదం జరిగితే ఆ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక భద్రత కల్పించేలా పథకాన్ని రూపొందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో పుట్టిన ప్రతి కుటుంబం తమకు భద్రత ఉందనే ధైర్యంతో జీవించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
ప్రతి నియోజకవర్గంలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ వర్గాలకు చెందిన విద్యార్థులంతా ఒకే పాఠశాలలో ఒకే కుటుంబంలా చదువుకునేలా వీటిని తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంగ్లిష్ మీడియం విద్యతో పాటు క్రీడలు, స్టేడియం వంటి సౌకర్యాలు కల్పిస్తున్నామని వివరించారు. కోదాడ, హుజూర్‌నగర్ ప్రాంత ప్రజలే తమ కుటుంబమని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భావిస్తారని, ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేసే నాయకులు లభించడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని భట్టి అన్నారు. ప్రజాప్రతినిధులు అధికారాన్ని ప్రదర్శించేందుకు కాకుండా ప్రజలు అప్పగించిన బాధ్యతను నెరవేర్చేందుకు పనిచేయాలని పేర్కొన్నారు. మునగాల హెలిప్యాడ్ నుంచి కిచెన్ శంకుస్థాపన ప్రాంతం వరకు కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు సుమారు 500 బైక్‌లతో ర్యాలీ నిర్వహించారు. పిల్లల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తని భట్టి విక్రమార్క అన్నారు. ఎదిగే వయసులో నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తే ఆరోగ్యవంతమైన మానవ వనరుగా ఎదుగుతారని, అందుకే పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు చిన్ననాటి నుంచే నాణ్యమైన ఆహారం అందించి ఉన్నత స్థాయికి తీసుకెళ్లే బాధ్యతను ప్రభుత్వం తీసుకుందని చెప్పారు.

