భువనగిరి రోడ్ల అభివృద్ధికి గడ్కరీకి ఎంపీ వినతి
కాకతీయ, భువనగిరి : భువనగిరి పార్లమెంట్ పరిధిలో రోడ్డు భద్రత, ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి చేపట్టాల్సిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. బుధవారం గడ్కరీని కలిసి వినతిపత్రం అందజేశారు. ఎన్‌హెచ్-163ను ఆరు లైన్లుగా విస్తరించడంతో పాటు అనంతారం, రామకృష్ణాపురం వద్ద అండర్‌పాస్‌లు, సర్వీస్ రోడ్లు నిర్మించాలని కోరారు. భువనగిరి కేంద్రీయ విద్యాలయం, స్వర్ణగిరి ఆలయం, బీబీనగర్ ఎయిమ్స్, సింగన్నగూడెం వద్ద అవసరమైన ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్‌హెచ్-565పై రోడ్డు విస్తరణ, ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, డ్రైనేజీ, సర్వీస్ రోడ్లు, ఎన్‌హెచ్-365పై హనుమాన్ ఆలయం వద్ద ఫుట్‌ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని కోరారు. పనులు పూర్తయితే ప్రమాదాలు తగ్గి ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఎంపీ తెలిపారు.

