పండుగకు పల్లెబాట..
హైవేలపై ట్రాఫిక్ పాట్లు!
చౌటుప్పల్, చిట్యాల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిపివేత
విజయవాడ హైవేపై 45 నిమిషాల నుంచి గంటకుపైగా నిరీక్షణ
బస్టాండ్లు కిటకిట.. ప్రత్యేక బస్సుల ఛార్జీలపై ప్రయాణికుల ఆగ్రహం
కాకతీయ, హైదరాబాద్ : దసరా పండుగను సొంతూళ్లలో జరుపుకునేందుకు నగరవాసులు పల్లెబాట పట్టడంతో జాతీయ రహదారులపై వాహనాల రద్దీ భారీగా పెరిగింది. హైదరాబాద్–విజయవాడ హైవేతో పాటు హైదరాబాద్–ముంబై, చెన్నై మార్గాల్లోనూ వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఆదివారం సద్దుల బతుకమ్మ, సోమవారం మహర్నవమి, మంగళవారం విజయదశమి సెలవులు రావడంతో కుటుంబాలతో కలిసి సొంత వాహనాల్లో బయలుదేరిన వారి సంఖ్య పెరిగింది. దీంతో ప్రయాణికులు ట్రాఫిక్ ఇబ్బందులతో సతమతమవుతున్నారు. హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై విస్తరణ, ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ట్రాఫిక్ రద్దీకి కారణమవుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. సుమారు 3 కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరగా, పట్టణాన్ని దాటేందుకు 45 నిమిషాలకు పైగా సమయం పడుతోంది. చిట్యాల వద్ద కూడా ఫ్లైఓవర్ నిర్మాణ పనుల కారణంగా వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. అక్కడ గంటకుపైగా ట్రాఫిక్‌లో చిక్కుకున్న వాహనదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పంతంగి టోల్‌ప్లాజా వద్ద రద్దీ పెరగడంతో విజయవాడ వైపు వెళ్లే వాహనాల కోసం 24 టోల్ బూత్‌లలో 16 తెరిచి ఉంచారు. హైదరాబాద్–వరంగల్, హైదరాబాద్–కరీంనగర్ రహదారులతో పాటు యాదాద్రి టోల్‌ప్లాజా వద్ద కూడా వాహనాల రద్దీ కొనసాగుతోంది. ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు చేపడుతున్న చర్యలు సరిపోవడం లేదని పలువురు వాహనదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
బస్టాండ్లలో రద్దీ.. ప్రత్యేక బస్సుల ఛార్జీలపై అసహనం
సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, ఉప్పల్, ఆరాంఘర్ బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. రద్దీకి అనుగుణంగా బస్సులు నడుపుతున్నామని ఆర్టీసీ చెబుతున్నా, ప్రయాణికులకు సరిపడా బస్సులు అందుబాటులో లేవని పలువురు చెబుతున్నారు. బస్సులు కిక్కిరిసి నడుస్తుండటంతో ప్రైవేటు వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రత్యేక బస్సుల పేరుతో 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారంటూ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. త్వరగా ఇంటికి చేరుకోవాలన్న ఆశతో బయలుదేరిన వారికి హైవేలపై ట్రాఫిక్ జామ్‌లు పండుగ ప్రయాణాన్ని ఇబ్బందికరంగా మారుస్తున్నాయి.

