రావణాసురుడి ప్రతిమ ప్రతిరూపాల ఘటనపై విచారణ జరపాలి
ప్రధాని మోదీ, అమిత్ షా ప్రతిరూపాల ఏర్పాటుపై ఫిర్యాదు
చిత్రాలు, దృశ్యాలను పరిశీలించి బాధ్యులను గుర్తించాలి
బీజేపీ మండల అధ్యక్షుడు కొంగర రవికుమార్ డిమాండ్
కాకతీయ, గీసుగొండ: కొత్తగూడెంలో నిరసన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ప్రతిరూపాలను రావణాసురుడి ప్రతిమపై ఉంచిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని బీజేపీ గీసుగొండ మండల అధ్యక్షుడు కొంగర రవికుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం గీసుగొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు సమర్పించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఉన్నప్పటికీ, కార్యక్రమాలు చట్టబద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. ఘటనకు సంబంధించిన చిత్రాలు, దృశ్యాలను పరిశీలించి బాధ్యుల పాత్రపై విచారణ జరపాలని, చట్టవిరుద్ధమైన చర్యలు జరిగినట్లు తేలితే తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా మండలి సభ్యుడు బిల్లా రమేష్, జిల్లా ఉపాధ్యక్షుడు రాదారపు శివకుమార్, అడెపు రమేష్, ములక సత్యం, యువజన విభాగం మండల అధ్యక్షుడు సల్లా శ్రావణ్, ఐలోని నరేందర్, కందుల రవివర్మ, 15వ డివిజన్ యువజన విభాగం అధ్యక్షుడు దొమ్మటి రాజ్‌కుమార్, 16వ డివిజన్ యువజన విభాగం అధ్యక్షుడు కందుకూరి విజయ్ తదితరులు పాల్గొన్నారు.

