గ్రావెల్ అనుమతులకు ఇక ఆన్‌లైన్ విధానం!
అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు సమీకృత పోర్టల్
దరఖాస్తు చేసుకున్న 3 నుంచి 5 రోజుల్లో అనుమతులు
క్యూఆర్ కోడ్‌తో వాహనాలు, తరలింపు వివరాల నమోదు
గ్రామ పంచాయతీలకూ ఆదాయంలో వాటా
పోర్టల్‌ను ప్రారంభించిన కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి
కాకతీయ, హనుమకొండ : గ్రావెల్ (మట్టి) తవ్వకాలకు అనుమతుల ప్రక్రియను సులభతరం చేస్తూనే అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు జిల్లాలో సమీకృత గ్రావెల్ నిర్వహణ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్లు కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి తెలిపారు. ఇకపై గ్రావెల్ అనుమతుల కోసం ప్రజలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని, రెవెన్యూ భూములకు సంబంధించిన అనుమతులను మూడు నుంచి ఐదు రోజుల్లో పరిష్కరిస్తామని వెల్లడించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఇంటిగ్రేటెడ్ గ్రావెల్ మేనేజ్‌మెంట్ సిస్టం పోర్టల్‌ను ఆమె ప్రారంభించారు. పౌరులు తమ మొబైల్ నంబర్ నమోదు చేసి ఓటీపీ ద్వారా లాగిన్ అయి దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ వివరించారు. దరఖాస్తులో ఆధార్ తదితర ప్రాథమిక వివరాలతో పాటు గ్రావెల్ ఎక్కడి నుంచి తీసుకోవాలనుకుంటున్నారో పేర్కొనాలని సూచించారు. సొంత పట్టా భూమి నుంచి తీసుకుంటే పట్టాదారు పాస్‌బుక్ కాపీ, ఇతరుల భూమి నుంచి తీసుకుంటే యజమాని సమ్మతి పత్రం అప్‌లోడ్ చేయాలన్నారు. ప్రభుత్వ భూముల విషయంలో సర్వే నంబర్, భౌగోళిక నిర్దేశాంకాలు సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. దరఖాస్తులు సంబంధిత అధికారులకు చేరతాయని, నీటిపారుదల శాఖకు సంబంధించిన అంశాలుంటే ఆ శాఖ లాగిన్‌కు కూడా పంపిస్తామని చెప్పారు. నీటిపారుదల శాఖ రెండు రోజుల్లో పరిశీలించి రెవెన్యూ శాఖకు నివేదిక పంపుతుందని వివరించారు. రెవెన్యూ శాఖ నిరభ్యంతర పత్రం ఇచ్చిన తర్వాత పరిమాణం ఎక్కువగా ఉంటే మైనింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారని, తక్కువ పరిమాణమైతే జిల్లా లాగిన్ ద్వారా అనుమతులు జారీ చేస్తారని తెలిపారు.


క్యూఆర్ కోడ్‌తో తరలింపుపై పర్యవేక్షణ
అనుమతి మంజూరైన తర్వాత క్యూఆర్ కోడ్ రూపొందుతుందని, అందులో అనుమతించిన గ్రావెల్ పరిమాణం, తీసుకెళ్లాల్సిన ప్రాంతం, గమ్యస్థానం, అనుమతి సమయం, వాహనాల నంబర్లు ఉంటాయని కలెక్టర్ తెలిపారు. అనుమతి పొందిన వాహనాల ద్వారానే గ్రావెల్ తరలించాలని స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీ సిబ్బంది అనుమతించిన ట్రిప్పుల సంఖ్య, వాస్తవంగా తరలించిన ట్రిప్పులను పర్యవేక్షించాల్సి ఉంటుందన్నారు. ఈ పోర్టల్ వినియోగంపై రెవెన్యూ అధికారులు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ ఇచ్చినట్లు వెల్లడించారు. గ్రావెల్ అనుమతుల ద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగం గ్రామ పంచాయతీలకు వెళ్తుందని తెలిపారు. ఈ పోర్టల్ ఇసుకకు వర్తించదని, కేవలం గ్రావెల్ (మట్టి) అనుమతుల కోసమేనని కలెక్టర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇసుక కోసం ప్రత్యేక పోర్టల్ ఇప్పటికే ఉందన్నారు. గనుల శాఖలో ప్రస్తుతం ఉన్న పోర్టల్ ప్రధానంగా జాతీయ రహదారుల వంటి పెద్ద ప్రభుత్వ పనులకు అవసరమైన అధిక పరిమాణంలోని మైనింగ్ అనుమతుల కోసం ఉపయోగపడుతోందని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, ఇతర చిన్న పనులకు తక్కువ పరిమాణంలో గ్రావెల్ అవసరమైనప్పుడు ప్రజలకు అనుమతులపై స్పష్టత ఉండటం లేదని, వారి సౌలభ్యం కోసమే కొత్త పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. ప్రజల్లో దీనిపై విస్తృత ప్రచారం కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్.రవి, స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ శేషాద్రి, డీఆర్వో శ్రీనివాస్, మైనింగ్ శాఖ ఏడీ రామాచారి, డీఆర్డీఓ మేన శ్రీను, సీపీఓ సత్యనారాయణరెడ్డి, జీడబ్ల్యూఎంసీ కాజీపేట డిప్యూటీ కమిషనర్ బిర్రు శ్రీనివాస్, సీ సెక్షన్ సూపరింటెండెంట్ చల్లా ప్రసాద్, సీజీజీ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాధాకృష్ణ, ఈడీఎం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. పోర్టల్‌కు సంబంధించిన పోస్టర్లను కలెక్టర్, అధికారులు ఆవిష్కరించారు.

