ప్రజావాణి అర్జీల పరిష్కారంలో వేగం పెంచాలి
20 వినతులు స్వీకరించిన అదనపు కలెక్టర్లు
కాకతీయ, ములుగు: ప్రజావాణిలో అందిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత శాఖల అధికారులు సత్వరమే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్లు సీహెచ్. మహేందర్ జి, ఎం. సంపత్ రావు సూచించారు. సోమవారం ములుగు జిల్లా సమీకృత కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మొత్తం 20 అర్జీలు అందగా వాటిలో భూ సమస్యలకు సంబంధించి 8, ఇందిరమ్మ ఇళ్లపై ఒకటి, ఇతర సమస్యలకు సంబంధించి 11 ఉన్నాయి. అర్జీలను శాఖలవారీగా పరిశీలించి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు. ఎలాంటి జాప్యం లేకుండా ప్రతి వినతిపై స్పందించి అర్జీదారులకు న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

