ప్రజల భద్రత కోసమే కార్డెన్ సెర్చ్!
నేరాల నియంత్రణకు గ్రామాల్లో తనిఖీలు
గుడుంబా తయారీపై పోలీసుల ఉక్కుపాదం
ప్రజలను అప్రమత్తం చేయడమే లక్ష్యం : సీఐ గణేష్
కాకతీయ, పెద్దవంగర: నేరాల నియంత్రణతోపాటు ప్రజలను అప్రమత్తం చేసేందుకే గ్రామాల్లో కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని తొర్రూరు సీఐ గణేష్ తెలిపారు. మంగళవారం రాజమాన్సింగ్ తండా, జయరాం తండా, పడమటి తండాల్లో పలువురు ఎస్ఐలు, పోలీసు సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. ఇంటింటికీ వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలు సేకరించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, వాహన ధ్రువపత్రాలు వెంట ఉంచుకోవాలని సీఐ సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. అక్రమంగా గుడుంబా తయారు చేస్తున్న నలుగురి నుంచి 20 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకుని, 100 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. నలుగురిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

