కార్యకర్తల జోలికొస్తే సహించేది లేదు!
కార్యకర్తల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధం
బీఆర్ఎస్ నేతలపై వీడియోల్లో తప్పుడు ప్రచారం
చిన్నా పెద్ద తేడా తెలియకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు
ఈ వీడియోల వెనుక ఎమ్మెల్యే అల్లుడి కుట్ర ఉంది
మూడేళ్లుగా పోలీసులతో తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు
బాంబుల బెదిరింపులు, వీడియోల రాజకీయాలకు స్వస్తి పలకాలి
అభివృద్ధి పనులపై ఆధారాలతో చర్చకు సిద్ధం
పార్టీ కార్యాలయ ఘటన వీడియోలు నా దగ్గర ఉన్నాయి
మరోసారి వీడియోలు విడుదలైతే మూడు రోజుల్లో సమాధానం
బీఆర్ ఎస్ నేత దాస్యం విజయ్ భాస్కర్ హెచ్చరిక
కాకతీయ, హన్మకొండ : కార్యకర్తల జోలికొస్తే సహించేది లేదని, వారి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని బీఆర్ఎస్ నాయకుడు దాస్యం విజయ్ భాస్కర్ స్పష్టం చేశారు. గత మూడేళ్లుగా పోలీసుల ద్వారా కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేయిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. బాంబుల బెదిరింపులు, రికార్డెడ్ వీడియోలతో రాజకీయాలు చేయడం మానుకోవాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అల్లుడు విష్ణువర్ధన్‌రెడ్డిని హెచ్చరించారు. మంగళవారం హన్మకొండ వడ్డెపల్లిలోని వారి స్వగృహంలో దాస్యం విజయ్‌భాస్కర్ విలేకరులతో మాట్లాడారు. ఈసందర్భంగా పార్టీ కార్యకర్తలపై, పార్టీ నేతలపై, దాస్యం కుటుంబ సభ్యులపై సోషల్ మీడియా వేదికగా ఆరోపణలతో కూడిన వీడియోలను రిలీజ్ చేస్తున్నారని అన్నారు. ఈ వీడియోల వెనుక వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అల్లుడు విష్ణువర్ధన్ రెడ్డి కుట్ర ఉందని ఆరోపించారు. 1989 నుంచి తన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైందని, తన అన్న స్వర్గీయ దాస్యం ప్రణయ్ భాస్కర్ వెంట పదో తరగతి నుంచే పోస్టర్లు అతికిస్తూ, జెండాలు మోస్తూ పనిచేశానని విజయ్ భాస్కర్ తెలిపారు. ప్రణయ్ భాస్కర్ టీడీపీలో ఉన్నప్పటి నుంచి, ప్రస్తుతం బీఆర్ఎస్లో కొనసాగుతున్నప్పటి వరకు తాను ఎలాంటి పదవులు ఆశించలేదన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ చట్టానికి లోబడే నిరసనలు తెలిపానని, తనపై ఇప్పటివరకు ఒక్క కేసు కూడా లేదని పేర్కొన్నారు. పోలీసు రికార్డులను ఎవరైనా పరిశీలించుకోవచ్చన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను బాంబులతో బెదిరించడం ఏమిటని ప్రశ్నించారు. ఎక్కడికి రమ్మన్నా కార్యకర్తలతో కలిసి వచ్చేందుకు సిద్ధమని సవాల్ విసిరారు. యువకులను గదుల్లోకి తీసుకెళ్లి రికార్డెడ్ సందేశాలు చెప్పించి వీడియోలు విడుదల చేయిస్తున్నారని విష్ణువర్ధన్‌రెడ్డిపై ఆరోపణలు చేశారు. ధైర్యముంటే ప్రజల్లోకి వచ్చి ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడాలని సూచించారు. పార్టీ కార్యాలయంలో బీర్ బాటిళ్లు విసిరిన ఘటనకు సంబంధించిన వీడియోలు తన వద్ద ఉన్నాయని, సరైన సమయంలో ఆధారాలతో సహా బయటపెడతానన్నారు. మరోసారి ఇలాంటి వీడియోలు విడుదలైతే మూడు రోజుల్లో సమాధానం చెబుతానని హెచ్చరించారు.
అభివృద్ధిపై ఆధారాలతో చర్చకు సిద్ధం
తాము అధికారంలో ఉన్న 15 నెలల కాలంలో వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టి, మంజూరు చేయించామని విజయ్ భాస్కర్ తెలిపారు. తాము మంజూరు చేసిన పనులకే ప్రస్తుతం ప్రారంభోత్సవాలు చేస్తూ తమ ఘనతగా చెప్పుకుంటున్నారని విమర్శించారు. ఆ పనులకు సంబంధించిన పత్రాలు, ఆధారాలు తన వద్ద ఉన్నాయని, ఎప్పుడైనా బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు. ప్రస్తుత పాలకులు రెండేళ్ల పది నెలల్లో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తాను వివాదాలకు దూరంగా ఉంటూ నిశ్శబ్దంగా పనిచేసుకునే వ్యక్తినని, కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తుండటంతోనే మాట్లాడాల్సి వస్తోందన్నారు. నాయిని రాజేందర్‌రెడ్డిపై తనకు గౌరవం ఉందని, ఆయన కూడా బెదిరింపులు, వీడియోల రాజకీయాలను ప్రోత్సహించరని భావిస్తున్నానన్నారు. ఈ తరహా రాజకీయాలకు స్వస్తి పలకాలని కోరారు. తన చర్యలన్నీ చట్టానికి లోబడే ఉంటాయని విజయ్ భాస్కర్ స్పష్టం చేశారు.

