లైన్మెన్ వసూళ్ల పర్వం!
రైతుల అవసరాలే అవకాశంగా మల్చుకుంటున్న అధికారి
డబ్బులివ్వకుంటే పనుల్లో జాప్యం చేస్తున్నారని ఫిర్యాదులు
రైతులు, వాహనాల డ్రైవర్లే లక్ష్యంగా అక్రమ వసూళ్లు
ఎల్సీ వ్యవహారంలో రూ.20 వేలు తీసుకున్నట్లు ఆరోపణలు
ఉన్నతాధికారుల విచారణపై బాధితుల ఆశలు
కాకతీయ, నిఘా ప్రతినిధి : విద్యుత్ పనుల కోసం వచ్చే రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి విద్యుత్ శాఖ సెక్షన్లో కలకలం రేపుతున్నాయి. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఓ లైన్మెన్ రైతులు, వాహనాల డ్రైవర్ల నుంచి అనధికారికంగా డబ్బులు అడుగుతున్నారని, అడిగినంత ఇవ్వకపోతే పనులు చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. తాజాగా ఓ రైతుకు సంబంధించిన ఎల్సీ వ్యవహారంలో రూ.20 వేలు వసూలు చేసినట్లు ఫిర్యాదులు రావడం చర్చనీయాంశంగా మారింది. డబ్బులు తీసుకున్న మరుసటి రోజు కూడా పని పూర్తి చేయలేదని ఫిర్యాదుదారులు పేర్కొంటున్నారు. దంతాలపల్లి సెక్షన్ పరిధిలో విద్యుత్ సరఫరా, లైన్ క్లియరెన్స్, ఇతర సాంకేతిక పనుల కోసం సిబ్బందిని ఆశ్రయించే రైతుల నుంచి అనధికారికంగా డబ్బులు అడుగుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అడిగిన మొత్తం ఇవ్వకపోతే పనులను ఆలస్యం చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధితులు చెబుతున్నారు. మూడు రోజుల క్రితం ఓ రైతుకు సంబంధించిన ఎల్సీ వ్యవహారంలో రూ.20 వేలు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే డబ్బులు తీసుకున్న మరుసటి రోజు కూడా సంబంధిత పని పూర్తి కాలేదని ఫిర్యాదుదారులు పేర్కొంటున్నారు.
గతంలో పనిచేసిన ప్రాంతాలపైనా ఆరా?
ప్రస్తుతం దంతాలపల్లి సెక్షన్లో విధులు నిర్వహిస్తున్న లైన్మెన్ గతంలో పెద్దముప్పారం, బంగ్లా ప్రాంతాల్లో పనిచేసినట్లు సమాచారం. దంతాలపల్లి ఆయన హెడ్క్వార్టర్గా ఉండగా, ఈ సెక్షన్ తుర్రూరు డివిజన్ పరిధిలోకి వస్తుంది. గతంలో పనిచేసిన ప్రాంతాల్లోనూ ఇలాంటి ఫిర్యాదులున్నట్లు సమాచరాం. విద్యుత్ శాఖ సేవల కోసం వచ్చే రైతులు, డ్రైవర్లు సిబ్బంది నుంచి ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే ఫిర్యాదులపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని బాధితులు కోరుతున్నారు. ఆరోపణలు నిజమని విచారణలో తేలితే బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే సంబంధిత లైన్మెన్ వివరణ, విద్యుత్ శాఖ అధికారుల స్పందన తెలియాల్సి ఉంది. అధికారిక విచారణ పూర్తయి ఆధారాలు పరిశీలించిన తర్వాతే ఈ వ్యవహారంపై స్పష్టత రానుంది.

